కొన్ని రోజుల కిందట ఓ ట్వీట్ తో దుమారం రేపిన తెలంగాణ బీజేపీ లీడర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తాజాగా మరో ట్వీట్ చేశారు. విపక్షాల ప్రధాని అభ్యర్థి కోసం వారు పడుతున్న పోటీని గొర్రెలతో పోల్చారు. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఒక స్టూలుపై నిలబడ్డ గొర్రెను కిందికి దింపి ఎక్కడానికి మిగతా గొర్రెలు ప్రయత్నం చేస్తుంటాయి. ప్రస్తుతం ప్రధాని అభ్యర్థి కోసం విపక్షాల నేతలు అచ్చం ఇలాగే పోటీ పడుతున్నాయని ట్వీట్ చేశారు.






కొద్ది రోజుల క్రితం మరో సెటైరికల్ ట్వీట్ చేశారు. జూన్ 29న చేసిన ఆ ట్వీట్ లో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరమని ఓ వీడియో ట్వీట్ చేశారు. అందులో ఓ వ్యక్తి దున్నపోతుల్ని ట్రాలీ ఎక్కించడానికి దాని వెనుక భాగంలో తన్నిన వీడియోని పోస్ట్ చేశారు. అలా తన్నగానే అది ట్రాలీలోకి ఎక్కింది. ఇలాంటి ట్రీట్మెంటే తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్‌ పెట్టారు. అయితే, దీన్ని ట్వీట్ చేసిన కాసేపటికే దానిని డిలీట్‌ చేశారు. మళ్లీ కొంత సేపు తర్వాత దాన్నే మళ్లీ పోస్ట్‌ చేయడం గమనార్హం. పైగా ఈ ట్వీట్ కు అమిత్‌ షా, బీఎల్‌ సంతోష్‌, సునీల్‌ బన్సాల్‌ లాంటి పెద్ద నేతలను ట్యాగ్ చేశారు. 


దీంతో మాజీ ఎంపీ అయిన జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అనే ప్రశ్న తలెత్తింది. ట్వీట్ తో పార్టీ పట్ల తన అసంతృప్తి చూపించారనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, అందరూ ఈ ట్వీట్ ని తప్పుగా అర్థం చేసుకోవడంతో తర్వాత మరో ట్వీట్ తో జితేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.






‘‘కేసీఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే.. బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో  చెప్పే ప్రయత్నాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఊరకుక్కల్లారా.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి’’ అని తర్వాత క్లారిటీ ఇచ్చారు.