Nagari YCP leaders  : తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతోంది.  నియోజకవర్గంలో  ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు తీవ్ర స్థాయిలో  మండిపడ్డారు.  రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మా భిక్షతోనే మంత్రి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని కామెంట్స్ చేశారు ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు. అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడెలా వందలకోట్లు సంపాదించారని ప్రశ్నించారు. 


రోజా సోదరులు నగరిని  దోచుకున్నారని ఐదు  మండలాల నేతల ఆగ్రహం                                       


నగరి నియోజకవర్గంలో భూకబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి.. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.  రోజా సోదరుల దోపిడికి అడ్డుగా ఉన్నామనే తమనే దూరం పెట్టారని వైసీపీ ఇంఛార్జులు ఆరోపిస్తున్నారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రోజాకు ఎట్టిపరిస్థితిలోనూ ఎమ్మెల్యే సీటు ఇవ్వొద్దని..ముఖ్యమంత్రి సీఎం జగన్ ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని వేడుకున్నారు. రోజాకు సీటు ఇస్తే నగరి నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని ఖరకండిగా చెప్పేస్తున్నారు.


రోజాకు కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కలిసి పని చేసి గెలిపించుకుంటాం..!                                    


రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు వ్యతిరేకవర్గం. ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమె భర్తకు వైసీపీ పార్టీతో సంబంధమేంటిని ప్రశ్నించారు. సెల్వమణి ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదని.. అలాంటి వ్యక్తి మాకు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని నిలదీశారు. పోలింగ్ బూత్ లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరమని చెప్పుకొచ్చారు.


సోమవారం రోజా వ్యతిరేక వర్గంపై సెల్వమణి విమర్శలు                      
 
రోజా భర్త సెల్వమణి నగరిలో ప్రెస్ మీట్ పెట్టారు. రోజాతో కలిసి నిర్వహించిన సమావేశంలో అసమ్మతి నాయకులపై విమర్శలు చేశారు. రోజాకు తప్ప ఎవరికి ఇచ్చినా పని చే్సతామని మొరుగుతున్నారని.. అందరికీ రోజా సాయం చేశారన్నారు.  నిండ్ర చక్రపాణి రెడ్డికి కూడా శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవి ఇప్పించింది రోజానేనన్నారు. మురళీని  జడ్పీటీసీని చేశామన్నారు. కేజే కుమార్ కు కూడా చెప్పామని.. తాము  ఎటువంటి ద్రోహం ఎవరికీ చేయలదన్నారు. తమపై రోజా భర్త చేసిన విమర్శలపై  వైసీపీ నేతలు మండిపడ్డారు.