Nagababu Meeting: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌, టీడీపీ-జనసేన పొత్తు ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నా.. ఈ పరిణామాలతో ఏపీలో ఇప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత వెంటనే టీడీపీతో పొత్తుపై జనసేన ప్రకటన చేయడం కీలకంగా మారింది. ఆ ప్రకటన తర్వాత జనసేన మరింత స్పీడ్ పెంచింది.


తమ పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్న స్థానాలపై జనసేన ఫోకస్ పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడంతో పాటు నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా జనసేన అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాపై జనసేన కన్నేసినట్లు తెలుస్తోంది. 23,24వ తేదీల్లో తిరుపతిలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నేతలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ కానున్నారు.


23వ తేదీన తిరుపతి, నగరి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల నేతలతో తిరుపతిలో నాగబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఇక 24న పుంగనూరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, మదనపల్లె, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో భేటీ కానున్నారు. చిత్తూరు జిల్లాలో జనసేన బలోపేతం, టీడీపీతో సమన్వయం చేసుకోవడం, భవిష్యత్ కార్యాచరణ లాంటి అంశాలపై నేతలకు నాగబాబు దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. తొలుత నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక సభ్యులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత నియోజకవర్గానికి చెందిన నేతలతో విడిగా భేటీ అవుతారు. 


ఈ సమావేశాల కోసం 23న ఉదయం 9 గంటలకు నాగబాబు తిరుపతికి చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు నేతలతో సమావేశాల అనంతరం 24న సాయంత్రం తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం అవ్వనున్నారు. ఈ సమావేశాల్లో జనసేన ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ కలికొం శశిధర్‌తో పాటు కాన్‌ప్లిక్ట్ మేనేజ్‌మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు జనసేన నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. నాగబాబు పర్యటను విజయవంతం చేయాలని శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. టీడీపీతో జనసేన పొత్తు ఖాయమైన క్రమంలో చిత్తూరు జిల్లాలో నాగబాబు పర్యటిస్తుండటం, నేతలతో సమావేశం కానుండటం కీలకంగా మారింది. తిరుపతి అసెంబ్లీ స్థానంతో పాటు పలు నియోజకవర్గాల్లో జనసేనకు బలం ఉంది. దీంతో పొత్తులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు సీట్లను జనసేన ఆశిస్తోంది. సమావేశంలో దీని గురించి కూడా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.


ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని తెలిపారు. సీట్ల సర్దుబాటు గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామన్నారు. ప్రస్తుతం రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.