Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం అవినీతిపై ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలు ఎదురుదాడి చేస్తోస్తున్నారని జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. తెనాలి (Tenali)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలవెల్లువ పథకం.. పాపాల వెల్లువగా మారిందని విమర్శించారు. రూ.కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని నాదెండ్ల ప్రశ్నించారు. వైసీపీ నేతలు, అమూల్‌ డెయిరీ (Amul Dairy) కోసమే ప్రభుత్వం పాల వెల్లువ పథకాన్ని తీసుకొచ్చిందని నాదెండ్ల అన్నారు. పథకాలు నేరుగా, పారదర్శకంగా ప్రజలకు అందాలనే జనసేన పోరాటం చేస్తోందన్నారు. 


గత ఏడాది మంత్రి మూడు లక్షలకు పైగా పాడి పశువులు కొన్నారని చెప్పారని గుర్తు చేశారు. కేవలం అమూల్ డైరీ కోసం 2.73 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నట్లు  చెప్పారని అన్నారు. చేయూత పథకం కేవలం అమూల్ డైరీ కోసమే ఏర్పాటు చేశారా అంటూ నాదెండ్ల ప్రశ్నించారు. మంత్రులు తమ శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలని, కానీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నవంబర్ 14 నుంచి జనసేన పార్టీ ప్రతి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం చేసిన స్కాములను ఎండగడతామన్నారు.


ప్రభుత్వం అంబులెన్సుల్లో స్కాంలకు పాల్పడిందన్నారు. అధికారులు చేశారా, లేక నేతలు చేశారా లేదంటే ఇద్దరు కలిసి చేశారా అంటూ నాదెండ్ల ప్రశ్నించారు. వైసీపీ నేతల్లో నిజాయితీ ఉంటే పాలవెల్లువ లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని  డిమాండ్ చేశారు. మూడు లక్షలకు పైగా పశువులు కొన్నట్లు నేతలు చెబుతున్నారని, కానీ క్షేత్ర స్థాయిలో కొన్నది మాత్రం 8 వేలని విమర్శించారు. వైసీపీ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా జిల్లాకు వెల్దామని సవాల్ విసిరారు. ఇలాంటి స్కాములపై జనసేన పార్టీ ప్రశ్నిస్తుందని, నిలదీస్తుందన్నారు. 


స్కాంలో భాగంగా రూ.738 కోట్ల రూపాయలు సబ్సీడీ నిధులు దారి మళ్లించారని నాదెండ్ల ఆరోపించారు. ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే పశువుల కొనుగోలులో రూ.2,887 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ప్రతి సారి ఎందుకు మారుతున్నాయని ప్రశ్నించారు. మంత్రులు ప్రకటించే వివరాలు నిజాయితీ ఏదని ప్రశ్నించారు. వచ్చే వారం అంబెలెన్సుల స్కాం గురించి ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. 


ఇన్ని స్కాములు చేస్తూ, సంక్షేమ పాలన చేస్తున్నామంటూ వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. తరచుగా జగన్ (AP CM YS Jagan) క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని, ఇదేనా క్లాస్ వార్ అంటే అని ప్రశ్నించారు. పేద మహిళలను మోసం చేస్తూ, పాల ఉత్పత్తి అద్భుతంగా పెంచేశామని చెప్పుకొంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 22 లక్షల లీటర్ల పాల ఉత్పత్తికి బదులు 2 లక్షల లీటర్లు సేకరిస్తూ పాల వెల్లువ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. జగసేన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


మంత్రులకు విషయ పరిజ్ఞానం లేదన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు మంత్రులు కొన్ని వారాల తరువాత ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు లెక్కలు చెబుతున్నారని, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పథకం అమలులో స్కాం జరగిందని, మంత్రులు క్షేత్ర స్థాయికి వస్తే నిరూపిస్తామని సవాల్ చేశారుప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుందనే ఆందోళన వైసీపీ మంత్రులకు లేదన్నారు.