Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతుంది, అందులోనూ ఖమ్మం జిల్లాలో మొదట ఓడిపోయేది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అని రాసిపెట్టుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓడిపోయే సీట్లలో మొట్టమొదటిది మధిరనే అని, తాము సీపీఎంతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు అని భట్టి బాధపడతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తమ్మినేనితో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు అని కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుంటుంది, అయ్యో తప్పు చేశామని భట్టి సైతం అనుకుంటారు. పొత్తులు సక్సెస్ అయితే తాను మరోసారి గెలిచి, సీఎల్పీనో లేక సీఎంనో అయ్యేవాడినో అని భట్టి బాధ పడతారంటూ సీపీఎం అగ్రనేత సంచలనానికి తెరతీశారు.


బెడిసికొట్టిన పొత్తులు, ఒంటరిగానే సీపీఎం పోటీ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి బరిలోకి దిగాలని సీపీఎం భావించింది. కానీ వారు కోరిన సీట్లు, కావాల్సిన స్థానాలు కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడంతో సీపీఎం చర్చలు బెడిసికొట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని సీపీఎం అగ్రనేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాలని తాము కోరుకోలేదని, కానీ తమ మిత్రుత్వం కాంగ్రెస్ కాదనుకుందన్నారు. దాంతో సీపీఎం సొంతంగా 19 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. 


బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు..
అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు మొన్నటివరకూ పొత్తు కోసం చూసిన కాంగ్రెస్ పార్టీపై సైతం తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల స్వభావం తమకు బాగా తెలుసన్నారు. ఈ రెండు పార్టీలు భూర్జువా స్వభావం కలిగి ఉన్నాయని. ఓవైపు బీఆర్ఎస్ పార్టీది అహంకార ధోరణి, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. కేసీఆర్ కమ్యూనిస్టులపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 


బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బెటర్ అనుకున్న సీపీఎం!
ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు కోసం సీపీఎం ప్రయత్నించింది. అయితే కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతూ సీపీఎంతో పొత్తులపై చర్చలకు సిద్ధమైంది. అయితే I.N.D.I.A కూటమిలో ఉన్న మీకు, ఆ కూటమికి దూరంగా మాకు పొత్తు ఏంటని బీఆర్ఎస్ అడిగిందన్నారు. దాంతో కాంగ్రెస్ సహకారం లేకుండా దేశంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏను ఓడించడం సాధ్యం కాదని భావించామని తెలిపారు. సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తామని భావించాం, అదే సమయంలో కాంగ్రెస్ పొత్తులకు ఆహ్వానించింది. చివరకు తమ స్నేహాన్ని వదులుకుని కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని, ఎన్నికల తరువాత అందుకు మూల్యం చెల్లించుకుంటుందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.


కేసీఆర్ ప్రధాని మోదీకి భయపడి తమను దూరం చేసుకున్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ విషయానికొస్తే ఖమ్మంలో సీటు లేకుండా పొత్తు సాధ్యమా అని ప్రశ్నించారు. త్రిపురలో తమ సిట్టింగ్ సీటును పీసీసీకి వదిలేశామని, రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రం మాకోసం త్యాగం చేయలేదన్నారు. పొంగులేటి ఉన్నారని పాలేరు ఇవ్వలేదు. వైరా, మిర్యాలగూడ సీట్లు ఇస్తామని చెప్పి.. చివరికి మిర్యాలగూడ ఒక్కటేనని కాంగ్రెస్ చెప్పడంతో పొత్తు కుదరదని తేల్చేశామన్నారు తమ్మినేని.