ENG Vs PAK World Cup 2023: పాకిస్తాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు దాదాపుగా అడుగంటినట్లే. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి అత్యంత భారీ స్కోరు చేసి, ఇంగ్లండ్‌పై 287 పరుగులతో విజయం సాధిస్తే అవకాశం ఉండేది. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో 300 పరుగుల తేడాతో విజయం సాధించిన సంఘటనలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఛేజింగ్ కాబట్టి ఇంగ్లండ్‌ను 100 పరుగులకే ఆలౌట్ చేసినా... కేవలం 16 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్ +0.743 ఉండగా పాకిస్తాన్ రన్‌రేట్ +0.036గా ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవ్వరికీ సాధించని గణాంకాలతో పాకిస్తాన్ విజయం సాధించాల్సి ఉంది. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఎంత బలహీనంగా ఉన్న అంత ఘోరంగా ఓడిపోతుందని ఊహించడం మాత్రం దాదాపు కష్టమే. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే పాకిస్తాన్ ఇప్పటివరకూ ఏ జట్టూ చేయని అద్భుతమే చేయాలి.
ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ టైటిల్ కల చెదిరిపోయినప్పటికీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే పాయింట్ల పట్టికలో టాప్ 8 జట్లలో ఒకటిగా ఉండాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించేందుకు ఇంగ్లండ్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్‌లకు అవకాశం ఉంది. తమ చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్... పాక్‌పై కూడా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి అర్ఙత సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది.
పాకిస్తాన్ ఈ ప్రపంచ కప్‌లో విఫలం అయింది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో మాత్రం పుంజుకుంది. ఈ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, ఇంగ్లండ్‌ల్లో ఏది గెలుస్తుందో చూడాలి. టాప్ ఆర్డర్ రాణిస్తే పాక్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై పాక్ భారీ ఆశలు పెట్టుకుంది. బాబర్‌తో కలిసి ఫఖర్ జమాన్ మరోసారి విధ్వంసం సృష్టిస్తే భారీ స్కోరు ఖాయమని చెప్పవచ్చు.
మరోవైపు ఈ ప్రపంచకప్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. ఈ మహా సంగ్రామంలో ఇంగ్లండ్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్ గత రెండు మ్యాచుల్లో రాణించడం ఇంగ్లండ్‌కు కాస్త ఉప శమనం కలిగించే విషయం. నెదర్లాండ్స్‌పై స్టోక్స్ 84 బంతుల్లోనే 108 పరుగుల ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చాడు. బ్రిటిష్ ఓపెనర్ మలన్‌కు అయితే ఇది మరచిపోలేని ప్రపంచ కప్. ఇంగ్లండ్ తరపును 300కుపైగా పరుగులు సాధించిన బ్యాటర్ కేవలం మలన్ ఒక్కడే. జో రూట్, హ్యారీ బ్రూక్, కెప్టెన్ జోస్ బట్లర్ తిరిగి ఫాంలోకి వచ్చి ప్రపంచ కప్‌ను ముగించాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ మెరుస్తున్నాడు. స్పిన్ అనుకూల పరిస్థితులు ఉండే ఈడెన్ గార్డెన్స్‌లో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌ల వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లను పాక్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఇంగ్లండ్ తుదిజట్టు
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్
పాకిస్తాన్ తుదిజట్టు
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం జూనియర్, హరీస్ రౌఫ్