Nadendla comments : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అది వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించేనని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. సమావేశం అయిన తర్వాత పవన్ కల్యాణ్ తాను రాష్ట్రం గురించి అంతా చెప్పానని..చెప్పారు తప్ప.. తమ మధ్య ఏ ఏ అంశాలపై చర్చ జరిగిందో మాత్రం వివరించలేదు. అటు వైపు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఎవరూ వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో లేకపోవడంతో.. సమాచారం రహస్యంగానే అంది. అయితే అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.
మోదీ - పవన్ భేటీ లో చర్చలు రహస్యమన్న జనసేన
ప్రధానమంత్రి మోదీ, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలు రహస్యంగా ఉన్నాయని.. వాటి గురించి తాము ఎప్పుడూ.. ఎవరికీ చెప్పలేదని .. చెప్పబోమని ప్రకటించారు. మోడీతో పవన్ భేటీ నిర్ణయాలను జనసేన వెల్లడించదన్నారు. మోడీ...పవన కల్యాణ్ భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితమన్నారు. ఎన్నికల సందర్భంలో జరగాల్సిన చర్చను ఇప్పుడు తేవడం సరికాదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు జనసేన నేత బొలిశెట్టి సత్య వంటి వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అలాగే మీడియాలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. వీటన్నింటికీ నాదెండ్ల మనోహర్ చెక్ పెట్టినట్లయింది.
పొత్తులపై బయట జరుగుతున్న చర్చ అంతా అర్థరహితమని తేల్చిన నాదెండ్ల
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని మోదీ .. పవన్‌కు చెప్పారని..బీజేపీతో కలిసే జనసేన పోటీ చేస్తుందని.. సోము వీర్రాజు చెబుతున్నారు. అదే సమయంలో జనసేనకు మోదీ రోడ్ మ్యాప్ ఇచ్చారని..వైఎస్ఆర్‌సీపీపై పోరాడటమే ఆ రోడ్ మ్యాప్ అని బొలిశెట్టి సత్య పలు టీవీ చానళ్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా.. ఒంటరి పోరాటం చేసే దిశగా ఉన్నాయన్న అభిప్రాయాలు వచ్చాయి. ఈ కారణంగా రాజకీయాల్లో మోదీ- పవన్ భేటీపై విశ్లేషణలు ఇంకా సాగుతున్నాయి. తాజాగా నాదెండ్ల మనోహర్.., మోదీతో జరిగిన చర్చల సారాంశాన్ని ్అసలు బయటకు చెప్పబోమని వెల్లడించడంతో.. వీరంతా బయట చెబుతున్నదంతా అబద్దమని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం
అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి ఏడాది దాటుతున్నా బాధితులకు ఇంత వరకూ కనీస న్యాయం చేయకపోవడంపై జనసేన పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. నాలుగు గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో నష్టపోయారని.. తన సొంత జిల్లాలో జరిగిన ఘోరం బాధితుల్ని పరామర్శించిన జగన్ మూడు నెలల్లో ఇంటి తాళాలు ఇస్తామని చెప్పారని.. కానీ ఇంత వరకూ న్యాయం చేయలేదన్నారు. ఇసుక మేటలు వేసిన పొలాల్లో ఎకరానికి రూ. 12,500 ఇస్తామని చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితిపై పవన కల్యాణ్ కు నివేదిక ఇస్తామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.