YSRCP MLA Vasantha Krishna Prasad: మైలవరం: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా చేశారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మైలవరం ఎమ్మెల్యే స్పందించారు. తాను వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్న ఆరోపణల్ని ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


తాను సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలంలో లంక భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నానని సైతం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. కొందరు కావాలని తనపై పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. అందులో భాగంగానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తన మద్దతుదారులకు, పార్టీ కార్యకర్తలకు ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.


కాగా, ఏపీలో అధికార పార్టీలో వరుసగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేశానని స్పష్టం చేశారు. గతంలో తనకు టికెట్ రాకపోయినా నమ్మకంగా పనిచేశానని, ఆపై సీఎం వైఎస్ జగన్ తనపై నమ్మకంతో రెండు సార్లు అవకావం ఇచ్చారని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఆపై విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి ( Devan Reddy ) కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం, రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.   గాజువాకలో పవన్ కల్యాణ్ ని ( Pawan Kalyan ) ఓడించి వైసీపీ తరపున బలంగా నిలబడ్డారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈసారి ఆయన ఆ స్థానాన్ని కొడుకు దేవన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మైలవరం ఎమ్మె్ల్యే వసంత కృష్ణప్రసాద్ సైతం రాజీనామా చేశారన్న వార్త అధికార వైసీపీలో కలకలం రేపింది. దీంతో ఆయన స్పందించి అదంతా అసత్య ప్రచారమంటూ ఆ వార్తల్ని ఖండించారు.