Andhra Pradesh News: గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు ఓటింగ్ ప్రక్రియను ఈవీఎం ద్వారా వివరించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి గల ఆవశ్యకతను వివరిస్తూ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ‘‘My First Vote to CBN’’ ఈవెంట్ నిర్వహించారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏపీ లీడర్స్ గా, వారియర్స్ గా ఎంపికైన వారితో కలిసి అరండల్ పేటలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ.. ఓటు ఎలా వెయ్యాలి, ఎవరికి ఓటు వెయ్యాలి అనే అంశాల పైన మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెళకువలు పాటించాలో కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఏర్పాటు చేసిన డమ్మీ ఈవీఎంలతో వివరించారు. ఈవీఎంలలో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కనే ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఓటు వేశాక వీవీ ప్యాట్ లో కనపడి అదృశ్యం అయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించిన తీరు యువతను ఆకట్టుకుంది.


ఏపీ వారియర్స్ అయిన జెట్టి జానకి రామయ్య, ఘంటా మౌళిక, నేపాక పద్మ తదితరులు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతను ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యత తెలపడంతో పాటు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఉన్న విలువను వారికి వివరించి కచ్చితంగా ఓటు వేయాలని సూచించారు.