Sarfaraz Khan has become an instant crowd favourite: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్(England)పై ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్ ద్వి శతక గర్జనతో బ్రిటీష్ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మూడో రోజు ఆటకు అర్ధాంతరంగా దూరమైన అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చి వికెట్ సాధించగా... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం సాధించి సర్ఫరాజ్ ఖాన్ సత్తా చాటాడు. కేవలం 72 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో 68 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అర్ధ శతకాలు సాధించిన సర్ఫరాజ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
సర్ఫరాజ్ రికార్డు
అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ నిలిచాడు. దిలావర్ హుస్సేన్, సునీల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ ఈ ఘనత సాధించాడు. దూకుడైన ఆటతీరుతో భారత జట్టులో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌కు ‘బజ్‌బాల్’ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో సర్ఫరాజ్ హోరెత్తించాడు. యశస్వితో కలిసి కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇలా
దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నా జట్టులో చోటు కల్పించడం లేదని అభిమానుల ఆవేదన, మైదానంలో అగ్రెసీవ్‌గా ఉంటాడు కాబట్టే భారత జట్టులో చోటు దక్కడం లేదని ఊహాగానాలు. టెస్ట్ జట్టు ప్రకటించే ప్రతీసారి.. ఈసారి జట్టులో చోటు పక్కా అనే వార్తలు. అసలు జట్టులోకి వస్తే రాణిస్తాడా... లేక చాలామంది ఆటగాళ్లలాగే అంచనాలు అందుకోలేక చతికిల పడతాడా అని... వీటన్నింటికి ఒకే ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ ఖాన్( Sarfaraz Khan) సమాధానం చెప్పేశాడు. వన్డే తరహా ఆటతో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. తన ఎంపిక సరైందేనని... తనలో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో రాణించే సత్తా ఉందని సర్ఫరాజ్ నిరూపించుకున్నాడు. అంతేనా తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించి రికార్డు కూడా సృష్టించాడు.
సాధికార బ్యాటింగ్
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సర్ఫరాజ్ ఖాన్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడుతున్నాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్ సింగిల్ కోసం యత్నించి రనౌట్ అయి నిరాశగా వెనుదిరిగాడు.