ముస్లిం మతగురువులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ముస్లిం మత పెద్దలతో పాటు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు బుధవారం (జూలై 19) చంద్రబాబును కలిశారు. అయితే, దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ముస్లింలకు విరుద్ధంగా టీడీపీ ఏ నిర్ణయమూ తీసుకోబోదని చంద్రబాబు వారికి స్పష్టం చేశారని ముస్లిం మతగురువులు తెలిపారు.


సమావేశం ముగిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని తాము కోరినట్లుగా ముస్లిం మత పెద్దలు తెలిపారు. యూసీసీ దేశ సంస్కృతికి విరుద్ధమని వివరించామని చెప్పారు. ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు చెప్పారని తెలిపారు. మతపరమైన విశ్వాసాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ చెప్పారు.