Mudragada denies daughter allegations:  ముద్రగడ పద్మనాభం తన కుమార్తె కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ లేఖ విడుదల చేసిన ఆయన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా   మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోందని ఆరోపించారు. తన కుమార్తె  కుటుంబానికి, మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్దలు వచ్చాయని..  ఒక సంవత్సరము నుండి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంధ్ అయ్యాయని ముద్రగడ తెలిపారు.  వారి జోలికి నేను వెళ్ళడం లేదు, అయినా మమ్ములను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.  కారణం మా చిన్నాబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగలిపోతున్నారని ఆరోపించారు. 

నాకు కేన్సర్ వచ్చిందని ఇంట్లో బందించి చిన్న కొడుకు, వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారన్నారు.  ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకొడుకే 100-1000 శాతం కారణం అని చెబుతున్నానని స్పష్టం చేశారు.  రోజు అన్ని సేవలు నాకు చేయకుండా గిరి బయటకు వెళ్లడన్నారు.  గతంలో నా భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైద్రాబాద్ హాస్పటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజులు తరువాత హాస్పటల్ నుండి విశ్రాంతి కోసం మీ ఇంటికి వస్తే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మీ ఇరువురూ మరిచారా అని ముద్రగడ ప్రశ్నించారు. 

ఇప్పుడు మీ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.... నాకు వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవన్నారు.  నేను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నానని..  నిత్యం నా ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానని తెలిపారు.  నన్ను బంధించి ఉంచడం కాని, మానసికంగా హింసించడం కాని ఎవ్వరి తరం కాదని తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ జీ.వోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారని  మీకు అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్ మరియు ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ పధకాలును అమలు చేయించి మీ డబ్బా కొట్టుకోండని సలహా ఇచ్చారు.  నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిని, లోకేష్ బాబుని, మరియు ఉప ముఖ్యమంత్రిని చూసి జాలి పడుతున్నానన్నారు. ఇకనైనా మీ అపాయింట్మెంట్లు, చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతక్కండనిలేఖలో పేర్కొన్నారు.  

ఇటీవల ముద్రగడ పద్మనాభం కుమార్తె బర్లగడ్డ క్రాంతి  .. తన తండ్రి అనారోగ్యంతో  బాధపడుతున్నా సరిగ్గా చికిత్స చేయించడం లేదని ట్వీట్ పెట్టారు. ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తన తండ్రి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా తన సోదరుడు గిరి.. ఆయన మామ అడ్డుకున్నారని ఆరోపించారు.   దీనికి ప్రతిస్పందనగా ముద్రగడ ఈ లేఖ రాశారు.