kaleshwaram commission | హైదరాబాద్: తనకు చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల కోసం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు.
న్యాయవ్యవస్థ, చట్టాల మీద గౌరవం ఉంది
అంతకుముందు సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అయిన తెలంగాణ భవన్‌కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నేటి ఉదయం కోకాపేటలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు. మా పాలనలో ఉన్నంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తాం. బీఆర్ఎస్ పార్టీకి న్యాయవ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద అపారమైన నమ్మకం ఉంది. అందుకే నోటీసులు రాగానే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నాం.
రైతుల కోసం కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం..
కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరించకూడదు. రాష్ట్ర రైతుల కోసం కేసీఆర్ నాయకత్వంలోని తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా వేలాది ఎకరాలను సాగునీరు అందించాం. దాంతో వేలాది బంజరు భూములు, బీడు భూములను రైతులు సాగు చేసి పంటలు పండించారు. ఇదివరకే కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాం’ అన్నారు హరీష్ రావు.
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కాళేశ్వరం కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. వీరు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులలో వారికి కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో జూన్ 5న అప్పటి ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తనకు తెలిసిన విషయాలను కమిషన్ కు వెల్లడించానన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెప్పిన ఈటల.. కాళేశ్వరం ప్రాజెక్టులో తన పాత్ర పరిమితమేనని చెప్పారు.
ప్రాజెక్టు, సాగునీటిపారుదల శాఖకు సంబంధించిన విషయం కాగా.. అవసరమైన నిధులను ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే ఆర్థిక శాఖపై ఉంటుందన్నారు. అధికారులు, ఇంజినీర్లు, నిపుణుల రిపోర్ట్ వచ్చాక మంత్రుల సబ్ కమిటీ దీనిపై చర్చించింది. తుది నివేదికను మంత్రివర్గం మొత్తం ఆమోదించిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసినట్లు ఈటల తెలిపారు.