MP Raghuramaraju: దుష్టుడు అయిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంచివాడైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్నేహం అంత మంచిది కాదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తెలిపారు. సోమవారం ఆయన దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ కు దన్నుగా నిలుస్తున్నారని భావిస్తున్న రాష్ట్రంలోని ఓ ప్రముఖ సామాజిక వర్గాన్ని విభజించాలని తమ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇందుకు ప్రాంతీయ తత్వాన్ని వదిలి జాతీయ దృక్పథంతో పార్టీని ప్రారంభించిన కేసీఆర్ వంటి మహా నాయకుడు తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఏపీకి చెందిన కొందరు విశ్రాంత అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారిని నియమించినందుకు, తమ సామాజిక వర్గాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారంటూ ఆయనను కలిసి అభినందనలు తెలియజేయడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్లు చేశారు. గతంలో పవన్ పై ఏడ్చే తమ పార్టీ నాయకులు యువశక్తి సభ అనంతరం పెడ బొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. హత్యలు చేసిన వారికి, శవాలను పార్సిల్ చేసిన వారికి బెయిల్ లభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాస్ కు మాత్రం నాలుగేళ్లుగా బెయిల్ లభించకపోవడం దురదృష్టకరం అని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో పెట్టుబడులొస్తాయా..!
మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పర్యాటక శాఖ మంత్రి రోజా డ్యాన్స్ చేస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. మంత్రులు ఇలా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతాయంటూ ఎద్దేవా చేశారు. వ్యాపారవేత్తలు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తే సమయం ఇవ్వరని, ఎవరైనా కచ్చితంగా కలవాలనుకుంటే నేరుగా తన ఇంటికే రావాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి రూ.1.70 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల చర్చలు కోట్లు దాటుతున్నా రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం లేదన్నారు. పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయిందని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రముఖ పారిశ్రామిక సంస్థ అమర్ రాజా బ్యాటరీస్ రూ.పది వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. పనికిరాని పాలకుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ పరిశ్రమతో పోలిస్తే ఇతర పరిశ్రమల్లో కాలుష్యం లేదని చెప్పిన రఘురామ కృష్ణంరాజు.. పాలకుల ఆలోచనా ధోరణి వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని విమర్శించారు. రాయలసీమలో పరిశ్రమల స్థాపనపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. రాయలసీమ రైతులకు బిందు సేద్యం ఇవ్వడం లేదని చెప్పారు.