Raghurama Krishnam Raju setires on Minister Botsa: ఆంధ్రప్రదేశ్ రాజధాని 2024 వరకూ హైదరాబాదే ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామ కృష్ణరాజు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఉన్నట్టుండి బొత్స హైదరాబాద్‌కు కూడా ఏపీ రాజధానే అనడం చర్చనీయాంశం అయింది. 3 రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా రఘురామ ఈ అంశంపై ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 


ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. అమరావతి నుంచి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు ప్రతి వారం వెళ్లిరావాలంటే రోజుకు రూ.60 లక్షల దాకా ఖర్చవుతుందనే విషయాన్ని గతంలో సీఎం జగన్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆ ఖర్చును తగ్గించడానికి కోర్టుకు హాజరవ్వడంలో మినహాయింపు ఇవ్వాలని కోరారని రఘురామ అన్నారు. అందుకే సీఎం హైదరాబాద్‌ నుంచే పాలన సాగిస్తూ, అక్కడి నుంచే కోర్టుకు వెళ్లి రావడానికి సౌకర్యంగా ఉంటుందని బొత్స ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనని రఘురామ ఎద్దేవా చేశారు. 


అమరావతిపై చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు శాసనసభ ఏకగ్రీవంగా చేసిన చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే చెప్పిందని అన్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా హైకోర్టుపై నిందలు వేస్తున్నారని రఘురామ అన్నారు. ప్రభుత్వం వచ్చాక ప్రజలకు నేరుగా రూ.1.32 లక్షల కోట్లు ఇచ్చినట్లు గవర్నర్‌ తన ప్రసంగంలో చెప్పారని, కానీ, అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన విషయాన్ని చెప్పలేదని అన్నారు. ఏపీలో మండలి రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత జగన్ దాన్ని వెనక్కు తీసుకున్నట్లుగానే అమరావతి విషయంలోనూ మనసు మార్చుకోవాలని హితవు పలికారు.


‘‘రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదు. ప్రజలకు నేరుగా పంపిణీ చేసిన రూ.1.32 లక్షల కోట్లు పోగా.. మిగిలిన రూ.2.68 లక్షల కోట్లు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం 71 శాతం పూర్తి చేసింది. ఈ ప్రభుత్వం మూడేళ్లలో 6 శాతమే పనులు చేపట్టింది. మిగిలింది ఎన్నేళ్లకు పూర్తి చేస్తారో చెప్పాలి. అసెంబ్లీలో మంత్రి గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు. అదే సమయంలో మాజీ సీఎం రోశయ్యను మర్చిపోయారు. 


పేదలకు కారు చౌకగా సినిమా టికెట్ ధరలు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు మళ్లీ ధరలు పెంచింది. అదే పేదలకు అన్యాయం చేయడానికి ఇప్పుడు ధరలను పెంచారా? ఏపీ ముఖ్యమంత్రి జగన్‌‌ని ప్రధాని మోదీ తండ్రిలా చూసుకుంటున్నారని గతంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. అది కరెక్టే. అప్పులు చేస్తూ చెడిపోతున్న కొడుకును తండ్రి సరిదిద్దినట్లుగానే ప్రధాని మోదీ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను సరిదిద్ది రాష్ట్రానికి మేలు చేయాలి’’ అని రఘురామ కోరారు.