Raghurama Krishna Raju: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ గవర్నర్‌కు శుక్రవారం లేఖ రాశారు. చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఐదు కిలోల బరువు తగ్గారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
మరింత బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం, అధికారులు యత్నిస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. హానికరమైన స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, తక్షణం చంద్రబాబు ఆరోగ్య విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజా నాయకుడు చంద్రబాబుకు వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను అభ్యర్థించారు.
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతల ఆందోళన
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినే చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అరెస్టైన మొదటి రోజు నుంచి ఆయనకు సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వేడి వాతావరణం కారణంగా చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురి అయ్యారని వార్తలు వచ్చాయి. మొన్న డీహైడ్రేషన్ అయ్యారని, నిన్న అలర్జీ వచ్చిందని చెప్పుకుంటున్నారు.
చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని ట్వీట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని ఆరోపించారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆయనకు ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చంద్రబాబు హెల్త్‌పై, జైలు అధికారుల తీర్పు ఆయన సతీమణి భువనేశ్వరి ఉదయం ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం , వయసు రీత్య సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు. ఇప్పటి ఆయన ఐదు కిలోల బరువు తగ్గారని... ఇలా బరువు తగ్గుతూ పోతే ఆయన కిడ్నీలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో నీళ్లు సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ సరిగా శుభ్రం చేయడం లేదని కూడా విమర్శించారు. ఇలాంటి వాతావరణమే అనారోగ్యానికి ప్రధాన కారణమని అన్నారు. ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణం తన భర్త ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు కోడలు నారా లోకేష్ భార్య బ్రహ్మణీ కూడా ట్వీట్ చేశారు. అపరిశుభ్రమైన వాతావరణంలో జైలులో ఉంచడం హృదయవిదారకరమైన ఘటనగా అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి ఆయనకు ప్రమాదకరమన్నారు. ఆయన ఆరోగ్య, వయసు రీత్య మెరుగైన వైద్య సేవలు అవసరం అని అభిప్రాయపడ్డారు. ఆయనకు కావాల్సిన వైద్యం సకాలంలో అందడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు.