చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో పూర్తి స్థాయి భద్రత ఉందని, ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉందని ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల జైళ్ళశాఖ డీఐజీ రవి కిరణ్ స్పష్టం చేశారు. ఆయనకు భద్రత పరంగా ఎలాంటి లోటు లేదని వెల్లడించారు. చంద్రబాబుకు అందించే తాగునీరు, భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే అనుసరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం వస్తుండగా, రోజూ దాన్ని పరీక్షించిన తర్వాతే ఆయనకు ఇస్తున్నట్లుగా వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై బయటి నుంచి వస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని వివరించారు. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఓఆర్ఎస్ కూడా అందిస్తున్నట్లు చెప్పారు.


ప్రస్తుతం జైలులో ఉన్న 2100 మంది ఖైదీలు మంచి నీటి ట్యాంకుల్లో ఉన్న నీటినే తాగుతున్నారని వివరించారు. ఆయన జైలులోకి వచ్చిన వెంటనే ఆయనతో ఉన్న మెడిసిన్స్ ను డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతున్నట్లుగా చెప్పారు. 


‘‘చంద్రబాబుకు దోమ తెర కూడా ఇచ్చాం. జైలు నిబంధనల ప్రకారం ఏసీ, కూలర్లు ఇవ్వలేము. కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు, ఆదేశాల ప్రకారమే మేం నడుచుకుంటాం. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న గదిలో 8 ఫ్యాన్లు ఉన్నాయి. జైలు నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. చంద్రబాబుకు భద్రతా లోపాలు ఉన్నాయన్న వార్తలు నమ్మకండి. చంద్రబాబు దగ్గరకు వేరే ఏ వ్యక్తికి గానీ, ఖైదీని కానీ అనుమతించడం లేదు’’


‘‘చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. నిపుణులైన డాక్టర్లు జైలు వద్ద అందుబాటులో ఉండి ఆయనకు అవసరమైన వైద్యం, మందులు ఇస్తున్నారు. చంద్రబాబు అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. చంద్రబాబుకు జైల్లో పక్కా భద్రతా ఏర్పాట్లు చేశాం. ఆయన సెక్యూరిటీ కోసం ఒక జైలర్ స్థాయి అధికారితోపాటు, మరో ఆరుగురు సిబ్బంది ఆయనకు అత్యంత దగ్గరలో ఉంటున్నారు. చంద్రబాబు ఉండే బ్యారక్ సమీపంలోకి ఇతర ఖైదీలు, సిబ్బంది వచ్చే పరిస్థితి లేదు. ఆయన కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉన్నారు’’ అని రవి కిరణ్ తెలిపారు.


చంద్రబాబు బరువు 67 కిలోలు


చంద్రబాబుకు రోజుకు 3 సార్లు మెడికల్ టెస్టులు చేయిస్తున్నాం. ప్రస్తుతం చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారు. బయట చెబుతున్నట్టుగా సీరియస్‌ గా ఏం లేదు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది మాత్రం బయటకు తెలపడానికి వీల్లేదు. అది కేవలం డాక్టర్‌కు, పేషెంట్‌కు మధ్య ఉండే విషయం మాత్రమే. నారా లోకేష్‌ చేసిన ట్వీట్‌ పూర్తిగా అవాస్తవం’’ అని డీఐజీ రవి కిరణ్‌ పేర్కొన్నారు.


నారా లోకేశ్ ట్వీట్
చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని ట్వీట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని ఆరోపించారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆయనకు ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.