Yatra-2 Movie: ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానం ఆధారంగా తెరకెక్కిన యాత్ర-2 మూవీ ఇవాళ విడుదలైంది. ఈ సందర్భంగా వైసీసీ, జగన్ అభిమానులు ధియేటర్ల వద్ద సందడి చేశారు. థియేటర్ల ముందు టపాసులు పేలుస్తూ, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్థానిక వైసీపీ నేతలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. థియేటర్ల దగ్గర భారీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా తమ అనుచరులు, క్యాడర్‌తో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాను వీక్షించారు. అందులో భాగంగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా యాత్ర-2 ప్రిమియర్ షో చూశారు. రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి సినిమా చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. యాత్ర-3 సినిమా కూడా ఉంటుందని స్పష్టం చేశారు. యాత్ర-2 అద్బుతంగా ఉంటుందని, జగన్ రాజకీయ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు దర్శకుడు చూపించాడని ప్రశంసించారు. ఇది ప్రజలు మెచ్చే సినిమా అని అన్నారు. ప్రజల అభిమానాన్ని సంపాదించుని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని జగన్ ఏ విధంగా ముందుకు నడిచారనే విషయాలను సినిమాలో చూపించారని తెలిపారు.  ఈ సినిమా బంపర్ హిట్ అవుతుందని, సినిమా చూస్తున్నంతసేపు అందరం ఎంజాయ్ చేశామని స్పష్టం చేశారు. ఇప్పటికీ జగన్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు.


జగన్ పర్యటనల సమయంలో ఆయన చుట్టూ పరదాలు కట్టడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై భరత్ స్పందించారు. సిద్దం సభల్లో జగన్ ర్యాంప్ మీద నడుస్తున్నారని, పరదాలు కట్టుకుని ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించారు. సిద్దం సభలో జనాల ముందుకు జగన్ వస్తుండటం ప్రతిపక్షాలకు కనపించడం లేదా? అని అన్నారు. సిద్దం సభల్లో లక్షల మంది పాల్గొంటున్నారని,  ఆ సభలు భారీ సక్సెస్ అవుతున్నాయని తెలిపారు. జగన్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదని, ఆయన ప్రజల గుండెల్లో  ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తాము స్పందించాల్సిన అవసరం లేదని  మార్గాని భరత్ పేర్కొన్నారు.


యాత్ర-2ను మహీ వి.రాఘవ్ తెరకెక్కించగా.. జగన్ పాత్రను తమిళ హీరో జీవా పోషించారు. ఇక వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. తొలి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకెళ్లడం, ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర వంటి సన్నివేశాలను సినిమాలో ప్రధానంగా చూపించారు. యాత్ర-1లో వైఎస్సార్ పాదయాత్ర చూపించగా.. దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో జగన్ పాదయాత్రను హైలెట్ చేశారు. జగన్ రాజకీయ ప్రస్థానంలో  ఇప్పటివరకు ఎదురైన కఠిన పరిస్థితులను సినిమాలో చూపించారు. ఎన్నికలకు ముందు వచ్చిన ఈ సినిమా వైసీపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ అభిమానులు ఆశిస్తున్నారు. జగన్ ఇమేజ్‌ను ఈ సినిమా మరింత పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.