Kesineni Nani :  ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తామని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.  శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని అన్నారు.  రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో కేశినాని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన  జగన్ మోహన్ రెడ్డి  సర్కార్‌పై  మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రికి  ఫిర్యాదు చేస్తామన్నారు. పాలకులు ఎవరైనా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటే ఇటువంటి దురాగతాలకు పాల్పడకూడదని తెలిపారు.               


వైసీపీ ప్రభుత్వంపై  ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న కేశినేని నాని                                          


వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో పూర్తి వ్యతిరేకత పెరిగిపోయిందని పేర్కొన్నారు. అందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. సామంతుల పరిపాలనలో లేమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని గుర్తుచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు చేసిన చంద్రబాబుపైనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.  ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితులే ఉండేవని.. హైదరాబాద్‌లో బస్సు దిగాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే వాటిని కంట్రోల్ చేయడంతో పాటు ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అదే పందాలో వెళ్లడంతో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.               


టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ చివరికి  బిచ్చమెత్తుకునే  స్థితికి వచ్చింది !       


టెర్రరిస్టులను ప్రోత్సహించిన పాకిస్థాన్ దేశం కూడా చివరకు శాంతి భద్రతలు లేకపోవడంతో దేశం బిచ్చమెత్తుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. ఐపీఎస్ అధికారులు సైతం ట్రాన్స్‌ఫర్ల భయంతో వైసీపీ నాయకులు చెప్పినట్టు వింటున్నారని కేశినేని నాని విమర్శించారు. ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వం కోసం.. రాజకీయ పార్టీల కోసం పని చేస్తే  విలువ ఉండదన్నారు. 


గతంలో  దాడులు జరిగినా పట్టించుకోని కేశినాని నాని - ఇప్పుుడు వైసీపీపై విరుచుకుపడటంతో  టీడీపీలో ఆశ్చర్యం                                       


కేశినేని నాని గతంలో టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు స్పందించలేదు. అయితే ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పుంగనూరు ఘటనపై స్పందించడం నేరుగా చొరవ తీసుకుని ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించడం...టీడీపీలో చర్చనీయాంసంగామారింది.  నిన్నామొన్నటి దాకా  చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పేవారు.  వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్స కార్యక్రమాల్లో పాల్గొని హల్‌చల్ చేశారు. తాజాగా టీడీపీకి, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడడంపై కృష్ణా జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయింది.