Repalle YSRCP Mopidevi Followers  :  రేపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ గా ఈపూరి గణేష్ ను నియమించడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రేపల్లె ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన తన కుటుంబసభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇప్పించాలనుకున్నారు. కానీ కొత్తగా ఈపూరి గణేష్ ను ఇంచార్జ్ గా నియమించారు.  ఇప్పటి వరకు రేపల్లె వైసీపీ అంటే మోపిదేవి వెంకటరమణ . రమణ అంటే వైసీపీ అన్న విధంగా ఉండేది .వైసీపీ పార్టీలో‌ సెకండ్ లీడర్ అన్న పదమే లేకుండా అప్పటి వరకు   మోపిదేవి నాయకత్వం కొనసాగింది. ఒక్క సారిగా ఈపూరు గణేష్ ను  నియోజకవర్గం ఇంచార్జ్ గా పార్టీ నియమించడంతో మోపిదేవి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. 


మోపిదేవికి అన్యాయం జరిగిందని నిరసనలు                  


మోపిదేవికి అన్యాయం జరిగిందని  రోడ్డుపై  రాత్రి టైర్లు తగలబెట్టి  రాత్రి నరసనకు దిగారు...ఈ రోజు నియోజకవర్గం లో నామినేట్ పదవులు ఉన్న వారు రేపల్లె పార్టీ ఆఫీస్ లో సమావేశం ఆయ్యారు...ఇంచార్జ్ గా మోపిదేవి వెంకట రమణనే నియమించాలని డిమాండ్ చేశారు...వైసీపీ ఇంచార్జ్ గా ఈపూరి గణేష్ నియామకం పట్ల తమ నిరసనను వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు...రాజీనామా చేసిన వారిలో చైర్మన్లు, ఎంపీపీ,ఎంపీటీసీ, జడ్పీటీసి లు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్లు, మెంబర్లు ఉన్నారు...  మోపిదేవి రమణ అభిమానులు సహితం తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 


టీడీపీకి కంచుకోటగా ఉన్న రేపెల్లే                


 టీడీపీకి కంచుకోటగా ఉన్న రేపల్లె నియోజకవర్గంలో పాగా వేయాలని వైసీపీ చూస్తుంది. రేపల్లెలో వైసీపీ ఇంతవరకు గెలవలేదు..1983 నుంచి ఇక్కడ టీడీపీ సత్తా చాటుతుంది. 1989, 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది…ఇక మిగిలిన అన్నీ సార్లు టీడీపీ గెలిచింది. చివరి రెండు ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీదే పైచేయి. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ గెలుస్తూ వస్తున్నారు..మోపిదేవి వెంకటరమణ ఓడిపోతూ వస్తున్నారు.


వారసుడి కోసం ప్రయత్నం చేసిన మోపిదేవి                          


మోపిదేవి రాజ్యసభకు వెళ్ళడంతో…నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తన వారసుడుని బరిలో దింపాలని చూశారు.   ఇప్పటికే మోపిదేవి వారసుడు రాజీవ్…రేపల్లెలో యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు.  అక్కడ పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ హఠాత్తుగా రేపల్లె నుంచి టీడీపీలో మంత్రిగా పని చేసిన ఈపూరు సీతారావమ్మ కుమారుడు డాక్టర్ ఈపూరు గణేష్ ను ఇంఛార్జ్ గా నియమించారు. దీంతో మోపిదేవి అనుచరులు రగిలిపోతున్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇంకా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.