ఈ ఏడాదిలో మరో వేసవి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మాములుగా వేసవిలో ఉండే ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతుండడంతో జనాలు మాడిపోతున్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు నమోదవుతున్నాయి. ఈసారి వానాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకు పెరుగుతుండడంతో ఉక్కపోత తప్పడం లేదు. ఉదయం 7గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం 5 దాటిన తరువాత కూడా ఎండ తీవ్రత కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ నెల ఆఖరి వరకు వర్షాలు కురుస్తాయి.  నైరుతి రుతు పవనాలు నిష్క్రమించినా చల్లదనం కొనసాగుతుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి తలకిందులైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. చాలాచోట్ల నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, భరించలేని ఉక్కపోత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

 

కోస్తా తీరప్రాంతాల్లో అయితే ఉక్కపోత ఊకిరి బిక్కిరి చేస్తోంది. కొన్ని చోట్ల అయితే బయటకు రావాలంటేనే జనం ఎండవేడికి భయపడిపోతున్నారు. బుధవారం ఏపీలో చాలాచోట్ల 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర నమోదైంది. గుంటూరు 37, కాకినాడ, కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు విజయనగరం విశాఖపట్నం 36 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని  విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.

ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మలో 37 డిగ్రీలు, రామగుండంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే ఈ స్థాయి ఉష్ణోగ్రతలు మండు వేసవిలో నమోదవుతుంటాయి. కానీ ఈసారి వానాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి ఎల్‌ వీ రావు వెల్లడించారు. 

 

నైరుతి రుతుపవనాల తిరోగమనం చాలా మందగించడంతోనూ, అలాగే వాయువ్య దశగా ఎక్కువగా గాలులు రావడం కారణంగా వాతావరణం వేడెక్కిందని వాతావరణ శాఖ చెప్తోంది. ఎండలు పెర గడానికి కూడా ఎక్కువగా రుతుపవనాలు మందగమనం, ఎల్నినో ప్రభావం.. తిరోగమన దిశలో మందగమనమే కారణం అని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉంటుందని వివరించారు. రుతుపవనాల సీజన్లో వేడి పెరగడానికి కారణాలు సర్వసాధారణమే అని తెలిపారు.

 

సాధారణంగా వాయువ్య ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల ఆ ప్రాంతం నుంచి వీచే గాలులు వేడిని తీసుకొస్తాయని, ఆ వీచే గాలుల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వివరించారు. దీని వల్ల గాలిలో తేమ కూడా తగ్గిపోయి పొడి వాతావరణం ఏర్పడుతుందిని, ఫలితంగా ఉక్కపోత ఉంటుందని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 18 వరకు ఇవే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తరువాత ద్రోణి, ఉపరితల ఆవర్తనం వంటివి వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని వల్ల కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వానలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 

 

వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వైరల్ జ్వరాలుతో పాటుగా ఇప్పుడు తీవ్రమైన ఎండలకు చర్మవ్యాధులు, పేత, వంటిపై కురుపులు వంటివి వస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ఇటువంటి వ్యాధులతోవస్తున్న వారి సంఖ్యకూడా పెరుగుతోంది.