TDP leader caught with cannabis in Vizag: గత కొంతకాలం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అంశం డ్రగ్స్, గంజాయి సరఫరా, వినియోగం. ముఖ్యంగా ఏపీలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో సరఫరా, డ్రగ్స్ వినియోగంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరి తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థి భాను ప్రియ శిష్యుడు హరికృష్ణ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు. విశాఖపట్నంలో 28 కేజీల గంజాయితో పట్టుబడటంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
టీడీపీ నేతలకు సంబంధించిన వ్యక్తి గంజాయి కేసులో అరెస్ట్ కావడంపై నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా స్పందించారు. ఏపీలో దొంగే దొంగా... దొంగా అన్నట్లు టీడీపీ పార్టీ పరిస్థితి తయారైందన్నారు. ఇప్పటివరకూ డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై బురదజల్లే కార్యక్రమం మినహా, తప్పు చేసినట్లు ఎక్కడా రుజువు చేయలేకపోయారని చెప్పారు. ప్రజలకు విఘాతం కలిగించే వ్యక్తులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, నగరి టీడీపీ అభ్యర్థి చేరదీస్తున్నారని రోజా విమర్శించారు. టీడీపీ నాయకులు రౌడీలను గుండాలను పెంచి పోషిస్తున్నారని, దొంగ పనులు చేసే అలవాటు టీడీపీకి పరిపాటిగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
ఏం సందేశం ఇస్తున్నారు..?
నేర చరిత్ర కలిగిన వ్యక్తి టీడీపీ యూత్ ప్రెసిడెంట్ గా ఉంటూ యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. గంజాయి అక్రమ తరలింపులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందనే అంశం బయటకు రావాల్సి ఉంది. హరికృష్ణను వెనుకనుండి నడిపిస్తున్న వారిని పోలీసులు బయటకు తీసుకురావాలి. మరోవైపు యువతను లక్ష్యంగా చేసుకుని కాలేజీలు, వాటి పరిసర ప్రాంతాలలో సైతం మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు వాటిని పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నగరి టీడీపీ అభ్యర్థి భాను ప్రియ శిష్యుడు హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రోజా అన్నారు.
డ్రగ్స్ అడ్డాగా ఫిట్‌నెస్ సెంటర్..
పీఎస్ ఫిట్‌నెస్ సెంటర్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిన వ్యక్తి హరికృష్ణ. పిల్లలు మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లితండ్రులతో పాటు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే కొందరు వ్యక్తులు యువత, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ సప్లైకి నిందితుడు హరికృష్ణ అడ్డాగా మార్చుకున్న సిమెంట్ షాపు, జిమ్ సెంటర్, ఇటుక దుకాణాలు సాధ్యమైనంత త్వరగా సీజ్ చేసి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి!
Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన