MLA Pinnelli Ramakrishna Reddy: పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే (Macherla MLA) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) గురుజాల కోర్టు (Gurazala Court)లో పాస్‌పోర్టు (Pinnelli Ramakrishna Reddy Passport)  అప్పగించారు. హైకోర్టు (AP High Court) ఆదేశాల మేరకు పిన్నెల్లి తరఫున ఆయన నాయవాదులు పాస్‌పోర్ట్‌‌ను బుధవారం గురజాల కోర్టులో సమర్పించారు. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలో ఈవీఎంను ధ్వంసం కేసు, టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం, మహిళ చెరుకూరి నాగశిరోమణిపై దుర్భాషలాడడం, కారంపూడిలో అలర్లు, సీఐ నారాయణస్వామిపై దాడి ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేయాలని ఈసీ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 


ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి రోజు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని ఆదేశించింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఈ క్రమంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోనే ఉండాలని, ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి నిత్యం సమాచారం ఇవ్వాలని సూచించింది. దేశం దాటి వెళ్లొద్దని, గురజాల మేజిస్ట్రేట్‌ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది.  కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్యే తరఫున ఆయన న్యాయవాదులు పాస్‌పోర్టును గురజాల కోర్టులో బుధవారం సమర్పించారు. 


రెండో రోజు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి
హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుధవారం రెండో రోజు కూడా ఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. రిజిష్టర్‌లో సంతకం చేసి  వెళ్లిపోయారు. పిన్నెల్లి ప్రస్తుతం నరసరావుపేట పట్టణం వినుకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉంటున్నారు. హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయిలో ఈసీ పూర్తి నిఘా ఉంచింది. ఆయన కదలికలను అనుక్షణం గమనిస్తోంది. ఏ విధమైన నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కేవలం హోటల్‌కే పరిమితం అయ్యారు. నరసరావుపేట దాటొద్దని కోర్టు ఆంక్షలు విధించడంతో పిన్నెల్లి సొంత నియోజకవర్గానికి వెళ్లే పరిస్థితి కూడా లేకపోయింది. దీంతో అక్కడి వైసీపీ నేతలు నరసరావుపేట వచ్చి ఆయన్ను కలుస్తున్నట్లు సమాచారం. ఓట్ల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏజెంట్ల నియామకం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 


పిన్నెల్లికి హైకోర్టు కండిషన్లు ఇవే..
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి రోజు పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని సూచించింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని,  గురజాల మేజిస్ట్రేట్‌ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. జిల్లాలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి సూచించింది. అనుచరులను నియంత్రించే బాధ్యత పిన్నెల్లి తీసుకోవాలని తేల్చిచెప్పింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడవద్దని, సాక్షులను ప్రభావితం చేయవద్దని సూచించింది. అలాగే పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది.