Telugu Desam Party: 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరికీ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావం జరిగిన రోజు చారిత్రకమైనదని గుర్తు చేశారు. మహానుభావుడు ఎన్టీఆర్ పార్టీని ప్రకటించిన ముహూర్త బలం గొప్పదని.. అందుకే నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతుందని అన్నారు.


‘‘29 మార్చి 1982 చారిత్రాత్మకమైన రోజు, తెలుగుజాతికి శుభదినం. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో మహూర్తబలం అంతగొప్పది. అందుకే నాలుగు దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21 ఏళ్లు అధికారంలో ఉండటం, 19 ఏళ్లు ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడటం నిజంగా అద్భుతం. ఆటుపోట్లకు బెదరకుండా, విఘ్నాలకు చెదరకుండా, తెలుగుజాతి అభ్యున్నతే లక్ష్యంగా సాగుతోన్న టీడీపీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. 


పుష్కరకాలం ఎన్టీఆర్ నాయకత్వంలో, గత 28 ఏళ్లుగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం సాధించిన విజయాలు అనన్య సామాన్యం. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీ కొత్తశకం లిఖించింది. రాష్ట్రాభివృద్ధిలో, పేదల సంక్షేమంలో ‘‘టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత’’ అని చూసేలా చేసింది, చరిత్రను తిరగరాసింది. ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనలో ఎన్నెన్నో అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు.. టీడీపీ వినూత్న పథకాలు దేశానికే దిశానిర్దేశం చేశాయి. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయ్యింది. రూ.2 కిలో బియ్యం ఆహారభద్రతకు బాటవేస్తే, వృద్దులకు నెలకు ఆనాడే ఎన్టీఆర్ ఇచ్చిన రూ.30 పెన్షన్ నేడు నెలకు రూ.2,500 అయ్యింది.


సిమెంట్ శ్లాబుతో పేదలకు పక్కా గృహాల నిర్మాణం దేశానికే దారిచూపింది. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీయే..తెలుగుగంగ, హంద్రి-నీవా, గాలేరు-నగరి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆధునీకరణ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ఎత్తిపోతల పథకాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నపూర్ణ అయ్యాయంటే అదంతా తెలుగుదేశం ఘనతే. పారిశ్రామికీకరణకు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు దేశవిదేశాలనుంచి పెట్టుబడులను రాబట్టి లక్షలాది యువత ఉపాధికి దోహదపడ్డారు. మహిళలు తమకాళ్ల మీద తాము నిలబడేలా చేసిన ఘనత చంద్రబాబుదే. రైతులు, కార్మికులు, యువత, మహిళాభ్యుదయమే తెలుగుదేశం లక్ష్యం.


తెలుగుదేశం లేని తెలుగురాష్ట్రాల అభివృద్ధిని కలలోనైనా ఊహించలేం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మానస పుత్రిక తెలుగుదేశం. రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే టీడీపీ రథ చక్రాలు. తెలుగుదేశం పార్టీ ప్రగతి రథానికి కార్యకర్తలే చోదక శక్తులు. యువత ముందుకు రావాలి, మహిళలు నడుం బిగించాలి, రైతన్న విజయదుందుభి మోగించాలి, కార్మిక సోదరులు కదం తొక్కాలి. ఇదే స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో ముందడుగేయాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలి. 40 ఏళ్లే కాదు 400 ఏళ్లయినా తెలుగుదేశం పార్టీ తెలుగువారి గుండెల్లో సజీవంగా ఉంటుంది. దుష్టశక్తులెన్ని ఆటంకాలు కల్పించినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతుంది. పోరాటమే మన ఊపిరని చాటాలి, విజయమే లక్ష్యంగా పోరాడాలి. ఆ మహనీయుడు ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే.. ఆచంద్రతారార్కం తెలుగుదేశం అజరామరం.. జోహార్ ఎన్టీఆర్.. తెలుగుదేశం వర్ధిల్లాలి’’ అని టీడీపీ పోలిట్ బ్యూర్ సభ్యులు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.