Fact Check :   డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ జమ గురించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి విశ్వరూప్‌కు అవమానం జరిగిందని కనీసం కుర్చీ కూడా వేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దళితులపై సీఎం జగన్ కు కనీస గౌరవం లేదన్న విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఆరోపణలు తీవ్రంగా చేస్తున్నారు. 


అయితే దీనిపై ఏపీ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. అక్కడ మంత్రికి ఎలాంటి అవమానం జరగలేదని.. స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో డ్వాక్రా మహిళలల ఫోటో సెషన్‌ నిర్వహించారు.  ఇది ప్రధాన వేదిక కాదు. ఫోటో సెషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  వేదికపై ముందు వరుసలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మధ్యలో కూర్చుని ఉండగా ఎడమవైపు ముగ్గురు మహిళలు, కుడి వైపున ముగ్గురు మహిళలు అప్పటికే కూర్చుని ఉన్నారు. అందులో అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా ఉన్నారు. వీరంతా ఫోటో దిగాల్సి ఉంది.


అయితే  ఆ సమయంలో వేదికపైకి రావాలంటూ మంత్రి విశ్వరూప్‌కు ముఖ్యమంత్రి సైగ చేశారు. వెంటనే అక్కడకు వచ్చిన మంత్రి ముఖ్యమంత్రి చెంతన నిలబడ్డారు. అంతలో సెక్యూరిటీ ఆఫీసర్‌ వచ్చి మహిళను లేపే ప్రయత్నం చేయగా ఆ మహిళ కూడా లేచి నిలుచుంది.  అంతలో ఆమెను కూర్చోవాలంటూ మంత్రి విశ్వరూప్‌ చేయిపట్టుకుని కూర్చోబెట్టారు.. అయితే వెనుక వరుసలో ఉన్న మహిళలు ఫోటోలో  కనిపించకపోవడంతో   క్రిందకు వంగిన మంత్రి ఆతరువాత  మోకాళ్లపై కూర్చున్నారు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి మహళను పక్కకు జరగాలని సూచించడంతో మంత్రి విశ్వరూప్‌ కుర్చీ చేతులు పెట్టుకునే ప్లేస్‌లో కూర్చుని ఫోటో దిగారు.                                        


 సోషల్‌ మీడియాతోపాటు కొన్ని ప్రధాన మీడియాల్లో దళిత మంత్రి విశ్వరూప్‌కు అవమానం జరిగిందన్న విమర్శలు వచ్చాయి.   మీటింగ్‌లో స్టేజీ పై కూర్చునేందుకు కనీసం కుర్చీ కూడా వేయలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... దీనిపై మంత్రి విశ్వరూప్‌కూడా స్పందించారు. ఏబీపీ దేశంతో ఆయన మాట్లాడుతూ సున్నా వడ్డీ జమ కార్యక్రమం సందర్భంగా గుర్తుగా తీస్తున్న ఫోటో అది.. అక్కడ కుర్చీ లేకపోవడంతో ఓ సోదరి కుర్చీలోకూర్చోవాలంటూ లేచి నిల్చుంటే నేనే ఆమెను కూర్చోబెట్టాను.  వెనుక ఉన్న సోదరీమణులు ఫోటోలో పడరేమోనని మోకాళ్లపై కూర్చునేందుకు ప్రయత్నించాను.. కానీ ముఖ్యమంత్రి వద్దని వారించి కుర్చీ వేయాలని అక్కడున్నవారికి సూచించారు. కానీ సమయం మరింత వృధా అవుతుందని భావించి తానే కుర్చీ వంచన కూర్చుని ఫోటో తీయించుకున్నామని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు.