Minister Savita challenges jagan:  తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని  మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో, జగన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులకే ఓర్వలేకపోతున్నారని,  మంత్రి నారా లోకేశ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేశ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? అని జగన్ ను మంత్రి సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన 67,27,164 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. వారందరికీ రూ.10,091 కోట్లు వెచ్చించామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున రూ.8,745 కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాలో జమచేశామన్నారు. మిగిలిన రూ.2 వేలు చొప్పున రూ. రూ.1,346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని మంత్రి సవిత వెల్లడించారు. ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, అయిదుగురుంటే రూ.65 వేలు తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. 

తల్లి ప్రేమకు జగన్ పరిమితి పెడితే, తమ ప్రభుత్వం తల్లి ప్రేమకు హద్దుల్లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు అమ్మఒడి పథకం అందజేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చి, మాటతప్పారని మండిపడ్డారు. ఇంట్లో ఇద్దరకు ముగ్గురు పిల్లులున్నా కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద రూ.13 వేలు అందజేశారన్నారు. 2022-23లో 42,61,965 మంది విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం కింద వర్తింపజేశారన్నారు. వారందకీ అప్పట్లో రూ.5,540 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో అదనంగా 24,65,199 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింప జేశామన్నారు. గత ప్రభుత్వం కంటే అదనంగా రూ.3,205 కోట్లు కేటాయించామన్నారు.  

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని మంత్రి సవిత గుర్తు చేశారు. తల్లికి వందనం పథకంతో పాటు పాఠశాలల ప్రారంభం రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279లని, ఆ కిట్టులో పాఠ్య పుస్తకాలు, వర్క్, నోట్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 3 జతల యూనిఫారం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్‌ ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు కడుపు నింపడమే కాదు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామన్నారు. పిల్లలు కూడా సంతోషంగా భోజనం చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో పాఠశాలలు, వసతి గృహాలకు, గోదాముల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ముతక బియ్యాన్ని సరఫరా చేశారని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం పథకం అమలుచేస్తున్నామన్నారు. 2014-19లోనూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశామని, జగన్ రెడ్డి ఆ పథకాన్ని నిలిపేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.  

తల్లికి వందనం పథకం అమలుతో జగన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని, దీంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు. తల్లికి వందనం పథకంలోని రూ.2 వేలు మంత్రి లోకేశ్ జేబులోకి వెళ్లాయని తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో మీరు చేసిన అవినీతిని మంత్రి లోకేశ్ పైకి నెట్టడం సరికాదన్నారు. మంత్రి లోకేశ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తావా.. అని జగన్ కు మంత్రి సవాల్ విసిరారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, సానుభూతి పునాదుల మీదే జగన్ రాజకీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నాడన్నారు.   మహిళలంటే జగన్ కు గౌరవం లేదని, తల్లిని, చెల్లెళ్లను, రాష్ట్రంలో ఆడ బిడ్డలను ఏడిపిస్తున్నాడని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతదేహాల దగ్గరికి వెళ్లి నవ్వుతాడని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీని అడ్డుకోడానికి జగన్ కుట్రపన్నాడన్నారు. డీఎస్సీని అడ్డుకోడానికి 24 కేసులు వేశారన్నారు. చివరికి సుప్రీం కోర్టులో కూడా కేసు వేస్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని తెలిపారు. ప్రజలు గట్టి గుణపాఠం చెప్పినా జగన్ రెడ్డికి బుద్ధి రాలేదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.