ఏపీ పర్యటక మంత్రి రోజా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మరోసారి వివాదాస్పద ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సంస్కారం గురించి చెబుతుంటే సన్నిలియోన్ వేదాలు వల్లించినట్లుగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు పూనిన చంద్రముఖిలా ప్రవర్తిస్తున్నారని, తరచూ పిచ్చిగంతులు వేస్తున్నారంటూ మంత్రి రోజా మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ ఓ పనికిమాలినవాడని, కోవిడ్‌ సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ హైదరాబాద్‌లో దాక్కున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రసంగంలో చప్పట్లు కొట్టేవారు అందరికీ కరోనా సమయంలో సేవలు అందించినది ఆ వాలంటీర్లేనని గుర్తు చేశారు.


కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ఆర్కే రోజా అధ్యక్షతన పామర్రు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నేడు (జూలై 14) జరిగింది. పామర్రు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరై స్థానిక శాసనసభ్యుడు కైలే అనిల్ ద్వారా నియోజకవర్గంలో అన్ని సచివాలయ పరిధిలో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


చంద్రబాబు హాయాంలో జన్మభూమి కమిటీల పేరుతో మోసం జరిగితే నీ నోరెందుకు లేవలేదని పవన్ కల్యాణ్ ను రోజా ప్రశ్నించారు.  పవన్‌కు చట్టాల గురించి తెలియదని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే ఆయనకు తెలుసని విమర్శించారు. అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ తన తల్లిని అన్నారు.. పెళ్లాన్ని అన్నారు.. పసిపిల్లలైన తన బిడ్డలను అన్నారని పవన్ కల్యాణ్ చెప్పుకుంటున్నారని, ఆ ఏడుపే తనలో కనిపిస్తోందని రోజా అన్నారు.


పవన్‌ కల్యాణ్ ఎవరి మాట వినడు కాబట్టే ఆయన్ను భార్యలు వదిలేశారని అన్నారు. బ్యాంకులు, మీ - సేవా కేంద్రాలు కూడా వివరాలు అడుగుతాయని, డేటా తీసుకుని అక్రమ రవాణా చేస్తున్నారని పవన్ కల్యాణ్ మోదీని అనగలడా అని ప్రశ్నించారు. ఎన్‌సీఆర్‌ నివేదికలో తెలంగాణ టాప్‌ టెన్‌లో ఉందని, దీని గురించి అక్కడ మాట్లాడితే కేసీఆర్‌ మక్కెలు విరగ్గొడతారని భయంతో అక్కడ మాట్లాడడం లేదని మంత్రి రోజా అన్నారు.


ఇంఛార్జి మంత్రిగా నియోజకవర్గంలో స్థానిక అంశాలపై మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకొని ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా, నియోజకవర్గ అధికారులకు తెలియజేయాలని సూచించారు. వాటికి తగు పరిష్కారాల కోసం చర్చించి తగిన సలహాలు సూచనలు చేసి సమావేశంలో ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన ప్రతి సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆర్కే రోజా ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు కైలే అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు, గారు, జిల్లా కోఆర్డినేటర్ పేర్ని నాని, మచిలీపట్నం, జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.