2023 క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా గెలుపు తథ్యమని ఏపీ పర్యటక శాఖా మంత్రి ఆర్కే రోజా ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా కప్ సాధించబోతుందని, ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడిందని అన్నారు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించి, 27 ఏళ్ళుగా ఉన్న రివెంజ్ ను ఇండియా తీర్చుకోబోతుందని అన్నారు. 160 కోట్ల భారతీయులంతా ఇండియా టీం గెలుపు కోసం ప్రార్థనలు చేయాలని కోరారు. దాదాపు 12 ఏళ్ళుగా ఇండియా వరల్డ్ కప్ సాధించేందుకు ఎదురు చూస్తుందని, 1983, 2011 తరవాత మళ్ళీ ఇప్పుడు వరల్డ్ కప్ గెలువబోతున్నామని అన్నారు. ఇండియా టీంకు మంత్రి రోజా ఆల్ ది బెస్ట్ చెప్పారు.


టీమిండియా కోసం యువకులతో కవిత రీల్


ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కల్వకుంట్ల కవిత కూడా టీమిండియాకు ఆల్ దిబెస్ట్ చెప్పారు. కొంత మంది యువకులతో ఆమె రీల్ చేశారు. టీమిండియా గెలవాలంటూ నినాదాలు చేశారు. ఉత్సాహంతో యువకులు కూడా ఇండియా గెలవాలని నినాదాలు చేశారు.






క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరులో మన భారత జట్టు విజయం సాధించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు వారు ఆల్ ది బెస్ట్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ దాన్ని రీట్వీట్ చేశారు.


వరల్డ్ కప్ గెలవాలని అలిపిరి వద్ద ప్రత్యేక పూజలు


వరల్డ్ కప్ ప్రారంభం అయిన నాటి నుంచి టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. లీగ్ దశలో హాట్ ఫెవరెట్ గా నిలిచిన అన్ని టీమ్లను చుట్టూ చేసి సెమీస్ కు చేరుకుంది. 2019లో సెమిస్ నాక్ అవుట్ మ్యాచ్ లో విజయానికి 10 అడుగుల దూరంలో టీమ్ ఇండియా కివీస్ జట్టుతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ ప్రతీకారాన్ని సైతం 2023 రోహిత్ సేన తీర్చుకున్నారు. ఇంకా అత్యంత ప్రమాదకరమైన ఆస్ట్రేలియా జట్టుతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ లో నేడు తలపడనుంది. ఆస్ట్రేలియా టీమ్ ఇండియా జట్లు ఫైనల్స్ లో ఇది వరకు ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా జట్టు 4 విజయాలు నమోదు చేసుకోగా, టీమ్ ఇండియా మూడు విజయాలతో ఉంది. 


అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ గెలవాలని ప్రార్థనలు హోరెత్తుతున్నాయి. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద టీమ్ ఇండియా విజయం కోసం జెన్ స్పోర్ట్స్ అకాడమీ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీమ్ ఇండియా గెలుపు కొరకు 108 కొబ్బరి కాయలు కొట్టి శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేన భారత్ కు మూడవ ప్రపంచ కప్ అందించడం ఖాయమని కిరణ్ అంటున్నారు. ఏ టీమ్ కూ లేని బ్యాటింగ్ ఆర్డర్ భారత్ వద్ద ఉందని, పటిష్టమైన బౌలింగ్, కట్టుదిట్టమైన ఫీల్డింగ్ ద్వారా భారత్ కప్ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.