Minister Nara Lokesh Angry On Ys Jagan: గత ఐదేళ్ల పాలనలో వేల మంది చనిపోయినా ఒక్క సమీక్ష నిర్వహించని జగన్.. ఇప్పుడు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారన్న జగన్ విమర్శలకు ఆయన ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'రాష్ట్రంలో ఐదేళ్ల పాటు గంజాయి, డ్రగ్స్ వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి ప్రజల మీదకు వదిలావ్. ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చావ్. అలాంటి నువ్వు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నావా.?.' అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


లోకేశ్ ప్రశ్నల వర్షం


ఈ సందర్భంగా జగన్‌కు మంత్రి లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు.


'1. నీ 5 ఏళ్ల పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గురి కాగా.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఏనాడైనా, ఒక్క మహిళ దగ్గరకు వెళ్లి పరామర్శించావా ? కనీసం ఒక్కసారైనా ఖండించావా ? ఒక్కసారైనా సమీక్ష చేశావా?.


2. నీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన  ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్ ?.


3. వైసీపీ 5 ఏళ్ల పాలనలో, నీ ముఠా మొత్తం ఎస్సీ, ఎస్టీల‌పై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీల‌పైనా దాడులకు పాల్పడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైన సంఘటన రాష్ట్రంలో మరొకటి ఉంటుందా. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతుంది. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా.?


4. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేస్తున్నావ్. అందులో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, ఇక ఆ త‌ర్వాత  మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా? ఎందుకీ అబద్ధపు బ్రతుకు జగన్ ?


5. రాష్ట్రంలో జరికే ప్రతి నేరానికి, నువ్వు పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా నీ పాలన సాగింది. ఒక్కసారైనా గంజాయిపై సమీక్ష చేశావా ? మేము రాగానే, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం.


6. 2014-19 మధ్య రాష్ట్రంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు బాడీ వార్న్ కెమెరాలు పెడితే, నువ్వు రాగానే వాటిని మూల పడేసింది నిజం కాదా ? ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని నాశనం చేసింది నువ్వు కాదా?  ఇవన్నీ నువ్వు , నీ పార్టీలో ఉండే క్రిమినల్స్ దొరక్కుండా ఉండటానికి, నువ్వు వేసిన ప్లాన్ కాదా.?


7. కూటమి ప్రభుత్వం రాగానే, 5 ఏళ్ల పాటు నువ్వు సమాజంలో నాటిన విష భీజాలు పీకి పడేసే పనిలో ఉంది. 120 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకుని వచ్చాం. గంజాయిపై ముందుగా దృష్టి పెట్టాం. గంజాయి మత్తులో జరుగుతున్న క్రైమ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం. ఏ ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుని, నేరం చేసిన వాడిని అరెస్ట్ చేస్తున్నాం. కేసు తీవ్రతని బట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో సైకోలని కంట్రోల్‌లో పెట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే చర్యలు ఉంటున్నాయి. నీలాగా నిద్ర పోవటం లేదు. 


8. సీమలో నువ్వు, నీ కుటుంబం పెంచి పోషించిన ఫ్యాక్ష‌నిజం అణిచివేసిన చరిత్ర చంద్రబాబు గారిది. సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్ట్ చేసిన చరిత్ర ఆయనది. నువ్వు, నీ కుటుంబం రౌడీలని పెంచి పోషిస్తే,  రౌడీ అనే పేరు వినబడటానికే భయపడేలా పీడీ యాక్ట్ పెట్టి శిక్షించింది చంద్రబాబు గారు. తీవ్రవాదంపై పోరాడింది చంద్రబాబు గారు. ఇప్పుడు కూడా గత 5 ఏళ్లు నువ్వు పెంచి పోషించిన సైకోలని, రాష్ట్రం నుంచి తరిమి కొట్టి, సైకోల ఫ్రీ రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబు గారే.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


Also Read: Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ శుభవార్త