Kottu Satyanarayana: రాజధాని అమరావతి ఇష్యూ ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. రాజధాని వేదికగా రాజకీయం నడుస్తూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రాజధాని అంశం మరోసారి తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజధాని వ్యవహారం కూడా కీలకంగా మారనుంది. దీంతో అమరావతిపై రాజకీయ నేతలు ఎప్పుడూ ఏదోక కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దసరా నుంచి సీఎం జగన్ అమరావతిని విడిచిపెట్టి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రుషికొండపై సీఎం క్యాంపు ఆఫీస్‌తో పాటు ఇల్లు కూడా దాదాపు పూర్తయింది.


దసరా నుంచి తాను విశాఖ నుంచే పాలన కొనసాగించనున్నట్లు ఇటీవల జగన్ స్వయంగా ప్రకటించారు. దీంతో రాజధాని అమరావతి ఎపిసోడ్ మరోసారి తెరపైకి రాగా.. మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి వ్యవహారంపై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి అమరావతి కూడా ముఖ్యమేనని అన్నారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని, అమరావతికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అమరావతికి ఇంపార్టెన్స్ ఇస్తూనే మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ది చేయాలనేదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అన్ని ప్రాంతాలను తాము సరిసమానంగా చూస్తున్నామని కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.


మంగళవారం సచివాలయంలో కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తమ ప్రభుత్వం అని ప్రాంతాలను అభివృద్ది చేయాలని చూస్తోందని, ఇది ఎన్నికల్లో కీలక అంశంగా మారుతుందని అన్నారు.  అమరావతి ముద్దు, మిగతా ప్రాంతాలు వద్దు అంటాయా అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఆలోచనతో మూడు రాజధానులను సీఎం జగన్ తెచ్చారని అన్నారు. అమరావతిపై సీఎం జగన్‌కు ఎలాంటి కోపం లేదని, అమరావతిలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అమరావతి ఒక్కటే రాజధాని అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని సూచించారు.  అమరావతిపై జగన్‌కు అభిమానం ఉందని, అందుకే శాసన రాజధానిగా చేయాలని భావించారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. 


అయితే మొన్నటివరకు అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పల్లవి అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. 23వ తేదీన జగన్ విశాఖ వెళ్లనుండగా.. 24వ తేదీన కొత్త ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇటీవల రుషికొండపై నిర్మించిన క్యాంపు ఆఫీస్,  ఇంటిని అధికారులు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జగన్ సెక్యూరిటీ కోసం రుషికొండ సమీపంలో ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇంట్లో ఇంటీరియల్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కూడా అధికారులు పరిశీలించారు. 23వ తేదీలోపు పనులన్నీ పూర్తై గృహప్రవేశానికి రెడీ కానుంది. విజయదశమి మంచి రోజు కావడంతో  ఆ రోజున జగన్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. కానీ విశాఖ నుంచి జగన్ పాలన చేయడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతి రాజధానిగా ఉండగా.. విశాఖను రాజధానిగా మార్చాలని జగన్ చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.