Errabelli Dayakar Rao: తెలంగాణలో మూడో సారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 80 నుంచి 90 సీట్లు గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు విశ్వసించడం లేదని, రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా కాంగ్రెస్ అభ్యర్థల జాబితా ప్రకటించడానికి సతమతమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొత్తవారి రాకతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న అభ్యర్థులు టికెట్లు కోల్పోయే పరిస్థితి నెలకొందని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్‌తో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందని ఎర్రబెల్లి అన్నారు. అందుకే ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందన్నారు. బీఆర్‌ఎస్‌లో సీట్లు ఆశించి దక్కని వారికి అధిష్టానం నచ్చచెప్పిందని, కానీ కాంగ్రెస్ పరిస్థితి అది కాదన్నారు. మైనంపల్లి హనుమంత రావు పరిస్థితిని ఉదహరిస్తూ... కాంగ్రెస్‌లో చేరిన తరువాత మైనంపల్లి రెండు సీట్లు అడిగితే అప్పటి వరకు ఆ పార్టీలో చేసిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినక తప్పదన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలతో తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్షన్ రూ.350 నుంచి 600 లోపే ఉందని, కానీ తెలంగాణలో నాలుగువేలు ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నాలుగు వేల పించన్ ఇవ్వాలని హితవు పలికారు. అక్కడ గ్యాస్ రూ.500కే ఇస్తే తెలంగాణలో నమ్ముతారని అన్నారు. హామీలు ఇచ్చిన వారు వారి పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారో లేదో ఆధారాలు చూపిస్తే ప్రజలు నమ్ముతారని అన్నారు. కానీ బీఆర్ఎస్ అలా కాదన్నారు.
తాము మేనిఫెస్టోలో పెట్టినవి, పెట్టనవి కూడా చేశామన్నారు. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పలేదని, కాళేశ్వరానికి నీరు, రైతు బంధు, మిషన్ భగీరథ ఇస్తామని చెప్పలేదని కానీ అవన్నీ చేశామన్నారు. ప్రజలకు ఏవైతే అవసరమో అవన్నీ చేసి చూపించామన్నారు. దేశంలో తెలంగాణ అమలు చేసినన్ని పథకాలు ఏ రాష్ట్రంలోను లేవన్నారు. ఎన్నికల సంబర్భంగా అన్ని వర్గాల కోసం సంక్షేమ మేనిఫెస్టో ప్రవేశ పెట్టనున్నట్లు దయాకర్ రావు తెలిపారు. గృహ లక్ష్మి కింద పేదలకు ఇళ్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. బీసీ బంధు, దళిత బంధు, మైనారిటీల కోసం పథకాలతో బీఆర్ఎస్ మేనిఫెస్టో దద్దరిల్లుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగా ఉందని ఎర్రబల్లి వెల్లడించారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో లీడర్లకే దిక్కులేదని, అందుకే బీఆర్ఎస్ నుంచి వెళ్లిన 30 నుంచి 40 మందికి టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు గ్రామాల్లో కార్యకర్తలు ఉన్నా నాయకులు లేరని అన్నారు. బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నారు. నాలుగైదు సీట్లకు మించి రావని అన్నారు. బీఆర్ఎస్‌కు 80 నుంచి 90 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది తనకు ఉన్న రాజకీయ అనుభవంతో చెబుతున్నానని అన్నారు.