మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌ జిల్లాలో జరిగిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొని మాట్లాడారు. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ల్యాబరేటరీలో రోజుకు ముగ్గురు రైతులు మరణిస్తున్నారని ఆయన విమర్శించారు. 'ఎల్‌కే అద్వానీ ఒక పుస్తకం రాశారు, అందులో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల ఒరిజినల్‌ ల్యాబరేటరీ గుజరాత్‌లో లేదని అన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రయోగశాల మధ్యప్రదేశ్‌లో ఉందని, ఇక్కడ రైతులు మరణిస్తున్నారు. ప్రజల సంపద దోచుకుని వైద్యం చేస్తున్నారు' అంటూ రాహుల్‌ విమర్శలు చేశారు. వ్యాపమ్‌ కుంభకోణంపైనా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు. దాదాపు కోటి మంది యువత భవిష్యత్తును నాశనం చేశారని, 40 మందిని చంపేశారని ఆయన ఆరోపణలు చేశారు.


ఎంబీబీఎస్‌ సీట్లను అమ్ముకున్నారని, వాటిని రిజిస్టర్‌ చేయించడానికి రూ.15లక్షలు డిమాండ్‌ చేశారని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ ఆగడాలు ఆగడం లేదని అన్నారు. బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ నేతలు ఆదివాసీలను అవమానిస్తారని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ-ఆర్‌ఎస్ఎస్‌  లాబరేటరీ ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని కాగ్‌ నివేదించినట్లు రాహుల్‌ తెలిపారు. 


కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌ నేతలు కమల్‌ నాథ్‌, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన తర్వాత రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించిన తొలి ర్యాలీ ఇది. మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెలువడనున్నాయి. 


2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని వింధ్య ప్రాంతంలో ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ ఆరు మాత్రమే గెలుచుకుంది. ఈ ప్రాంతంలో తిరిగి రాజకీయ పట్టు సాధించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. పార్టీ ప్రాబల్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ర్యాలీని చేపట్టింది. ఇక్కడ రాహుల్‌ ఇది రెండో ర్యాలీ. మొదటి ర్యాలీ సెప్టెంబరు 30న షాజాపూర్‌ జిల్లాలో జరిగింది.


రాహుల్‌ గాంధీ మధ్యప్రదేశ్‌లో పార్టీ అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశం కానున్నారు. బియోహరి ప్రాంతంలో చేపట్టబోయే ర్యాలీకి లక్ష మందికి పైగా హాజరవుతారని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. వింధ్య ప్రాంతంలోని ముఫ్ఫై స్థానాల్లో అత్యధిక ప్రజలను సమీకరించేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తిరిగి ఇక్కడ తమ పార్టీ వైభవాన్ని నిలబెట్టుకోవాలని కృషి చేస్తున్నారు. 


అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రచారాలు జోరందుకున్నాయి.  ఇరు వైపులా నేతలు ప్రచారాలు ప్రారంభించారు.  ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే  ప్రధాని నరేంద్ర మోదీ జులైలో షాదోల్‌ను సందర్శించి గిరిజనుల కోసం పలు పథకాలను ప్రకటించారు.  మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌ ఈ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే బీజేపీ ఇప్పటికే నాలుగు వేర్వేరు జాబితాల్లో 136 మంది అభ్యర్థులను ప్రకటించింది.