ఆదిలాబాద్‌లో అమిత్‌షా పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత... బీజేపీ నిర్వహిస్తున్న మొదటి సభ ఇది. వచ్చే  ఎన్నికల్లో గెలుపే లక్ష్యం బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని రెండు సార్లు తెలంగాణలో  పర్యటించారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతేకాదు.. నిజామబాద్‌ సభలో బీఆర్‌ఎస్‌ దుమ్ముదులిపారు ప్రధాని. అధికార  పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ రహస్యాలు అంటూ... సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ తన దగ్గరకు వచ్చారని... NDAలో  చేరేందుకు కూడా సిద్ధమయ్యారని అన్నారు. కానీ అవినీతి, కుటుంబ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను తామే దూరం పెట్టామన్నారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు కూడా  వేశారు ప్రధాని మోడీ. అమిత్‌షా కూడా మోడీ బాటలోనే ఘాటు విమర్శలు చేస్తారా..? అన్నది ఉత్కంఠగా మారింది.


ఎన్నికలకు ఇంక 50 రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో తెలంగాణలో పర్యటిస్తున్న అమిత్‌షా... రాష్ట్ర నేతలు ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. ఎన్నికల వేళ ఎలా  వ్యవహరించారని... ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇందు కోసం రాత్రి 7గంటల 40నిమిషాల నుంచి 8గంటల 40నిమిషాల వరకు ఐటీసీ కాకతీయలో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు అమిత్‌షా. ఎన్నికల సన్నద్ధతపై నేతలతో చర్చించనున్నారు. అలాగే, ఎన్నికల స్ట్రాటజీ, నేతల మధ్య  సమన్వయం, తాజా రాజకీయ పరిణామాలపై కూడా నేతలతో అమిత్ షా చర్చిస్తారని సమాచారం. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే 14 కమిటీలు వేసింది పార్టీ  నాయకత్వం. వాటి పనితీరును కూడా అమిత్‌షా పరిశీలించనున్నారు. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో, కేంద్ర పార్టీ సహకారం వంటి అంశాలపై కూడా తెలంగాణ నేతలతో  అమిత్‌షా చర్చిస్తారని సమాచారం. అంతకుముందు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఇంపీరియల్‌ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొంటారు. 


తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీని ప్రకటించారు. ఈ హామీలను ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లేందుకు  ఆదిలాబాద్‌ సభను ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు.. ఈ సభ ద్వారా బీజేపీ శ్రేణుల్లో జోష్ పెంచాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో ఆశావహులు కూడా ఎక్కువై... గ్రూప్‌ తగాదాలు  మొదలైనట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లోపార్టీ నేతల మధ్య సఖ్యత నెలకొల్పేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తోంది. 


కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. నాగపూర్‌ విమానాశ్రయం నుంచి నేరుగా ఆదిలాబాద్‌ రానున్నారు అమిత్‌ షా. మధ్యాహ్నం 3 గంటల  నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ జనగర్జన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో ఆదిలాబాద్‌ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేశారు బీజేపీ నేతలు. ఆదిలాబాద్‌లో సభ  తర్వాత... ఐటీసీ కాకతీయకు వెళ్లి విశ్రాంతి తీసుకోనున్నారు అమిత్‌షా. ఆ తర్వాత ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొంటారు. అనంతరం.. ఐటీసీ  కాకతీయలో పార్టీ ముఖ్యనేతలో సమావేశమై ఎన్నికల వ్యూహ రచనపై చర్చిస్తారు. రాత్రి 9గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు అమిత్‌షా.