పోలవరం నిర్వాసితుల సమస్య కొత్తగా వచ్చింది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదన్నారు. కమిషన్లు వచ్చే పనులే చేశారని.. గిరిజనులను గాలికొదిలారన్నారు. నిర్వాసితుల కోసం టీడీపీ 5 ఏళ్లలో 3,110 ఇళ్లు కట్టిందని.. కానీ ఈ రెండేళ్లలో 47 కాలనీల నిర్మాణం వైసీపీ పూర్తి చేసిందని చెప్పారు.
'రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ భాషలో విచక్షణ లేకుండా ఉండొద్దు. కనీస సంస్కారం కూడా లేకుండా లోకేష్ మాట్లాడుతున్నాడు. ఆయన అమెరికాలో చదువుకున్నా కనీస సంస్కారం లేదు. తండ్రి, కొడుకు ఇద్దరూ పూర్తిగా ఫ్రస్టేషన్‌లో మునిగిపోయి మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా, చాలా హీనమైన భాషను లోకేష్ మాట్లాడుతున్నాడు’ అని కన్నబాబు అన్నారు.
'పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు బొడ్డు కోసి మొదలు పెట్టినట్లు లోకేష్ మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి ఆ ప్రాజెక్టును ప్రారంభించింది రాజశేఖర్‌రెడ్డి. ఆయనే దానికి అనుమతులు తీసుకువచ్చాడు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం కాసులు కురిపించేదిగానే చూశాడు. దాన్ని ముందుకు తీసుకుపోలేదు. రాష్ట్రానికి వెన్నెముక అయిన ప్రాజెక్టును సీఎం జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్ణీత వ్యవధిలో దాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు’. అని కన్నబాబు చెప్పారు.
లోకేష్ మాటలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయిందని కన్నబాబు అన్నారు. పోలవరం గురించి లోకేష్ కు ఏ మాత్రం తెలియదన్నారు. అందుకే ఇలా పైపై మాటలు మాట్లాడి, సీఎం గారిని తిడితే జనం చూస్తారని అనుకుంటున్నారా అని కన్నబాబు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా నిర్వాసితుల గురించి ఆలోచించారా అని అడిగారు.
ఆ పనులు కమిషన్ల కోసం కాదా?:
గోదావరిలో ప్రవాహం వస్తే, మళ్లించడం కోసం గత ప్రభుత్వం స్పిల్‌వే పూర్తి చేయకుండా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేశారు. అవి ఎందుకు చేశారు. కమిషన్లు వచ్చే పనులనే ముందు చేశారు కదా. అందుకే కదా ఇవాళ నిర్వాసితుల సమస్య వచ్చింది. అసలు కేంద్రం నుంచి ప్రాజెక్టును మేమే కడతామని ఎందుకు తీసుకున్నారు. కేవలం కమిషన్ల కోసమే కదా. మీ జేబులు నింపుకోవడానికే కదా. ఇవన్నీ చర్యలన్నీ ప్రజలు 5 ఏళ్లు సునిశితంగా గమనించారు కాబట్టే, మిమ్మల్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపారు.
- కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి
ఆ రోజు కన్నబాబు పక్కనే ఉన్నారు: నారా లోకేశ్
మంత్రి కన్నబాబు వ్యాఖ్యల పై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పోలవరం నిర్వాసితులకు జగన్ రెడ్డి హామీలు ఇచ్చినప్పుడు కన్నబాబు పక్కనే ఉన్నారని తెలిపారు. 'దమ్ముంటే పోలవరం ముంపు మండలాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటించాలి. మీకు ధైర్యం ఉంటే రండి కలిసి పర్యటిద్దాం.. వాస్తవాలు ప్రజలే చెబుతారు. కన్నబాబు పక్కన ఉండగా జగన్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోలు విడుదల చేస్తున్నాను. నన్ను తిట్టినా.. అరెస్ట్ చేసినా అన్నింటికి నేను సిద్ధం. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ నేను పోరాడతాను. జగన్ రెడ్డి మెడ వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పోరాడతాం.' అని లోకేశ్ చెప్పారు.