నారా లోకేష్ పై గతంలో బాడీ షేమింగ్ తరహాలో కామెంట్లు విసిరేవారు వైసీపీ నేతలు. ఇటీవల ఆయన స్లిమ్ముగా మారిన తర్వాత ఈ కామెంట్లు వినపడ్డంలేదు. మంత్రి కాకాణి కూడా నారా లోకేష్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని అంటూనే గడ్డం పెంచి, మీసం పెంచి జనాల్లోకి వచ్చినంత మాత్రాన సరిపోతుందా అంటూ సెటైర్లు వేశారు.


ఇటీవల నారా లోకేష్ తాను సాఫ్ట్ కాదని, రఫ్ అని చెప్పుకుంటున్నారని, ఆయన గడ్డం పెంచినంత మాత్రాన ఏమవుతుందని వెటకారం చేశారు. నేను చాలా హాట్ గురూ అంటున్న లోకేష్ తో టీడీపీకి ఉపయోగం లేదన్నారు. అసలు లోకేష్ కి సబ్జెక్టే లేదన్నారు కాకాణి.   ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో మంత్రి కాకాణికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ప్రశ్నించారు నారా లోకేష్. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసు వ్యవహారంపై స్పందించాలన్నారు. రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే.. దానిపై స్పందించేందుకు సబ్జెక్ట్ లేక లోకేష్ తనపై వ్యక్తిగతంగా విమర్శలకు ప్రయత్నించారని మండిపడ్డారు మంత్రి కాకాణి. నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించిన కాకాణి లోకేష్ పై మండిపడ్డారు. లోకేష్ ఇటీవల గడ్డం, మీసం పెంచుకుని తిరుగుతున్నారని, ఆయన చాలా రఫ్ అంటున్నారని, అయితే ఏంటని నిలదీశారు. ఆవు చేలో మేస్తే దూడ నడిచేలో మేస్తున్నట్టు లోకేష్ పరిస్థితి ఉందని చెప్పారు. లోకేష్ చాలా హాట్ గురూ, రఫ్ గురూ అంటున్నారని, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ ఎన్ని వేషాలు వేసినా ఎవరికీ ఉపయోగం ఉండదని ఘాటుగా విమర్శించారు.


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు కాకాణి గోవర్దన్ రెడ్డి. టీడీపీ హయాంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారంటూ తప్పుడు కథనాలు రాయించారని, అసలు టీడీపీ హయాంలో మెడికల్ కాలేజీలు రాలేదని చెప్పారు. ఎవరో మొదలు పెట్టినవాటిని, తమ హయాంలో రిబ్బన్ కట్ చేసి సోకులు చేసుకోవడం చంద్రబాబుకి అలవాటేనన్నారు. ఆయన జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పలేదని, ఆయన అసహ్యాన్ని జయించిన వారని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు వచ్చేదఫా కుప్పంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు కాకాణి. ఆయన అక్కడినుంచి పారిపోతారని జోస్యం చెప్పారు. కుప్పంకి చంద్రబాబు చేసిందేమీ లేదని, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఓటమితోనే చంద్రబాబుకి భయం వేసిందని అందుకే అసెంబ్లీలో తనని ఎవరో ఏదో అన్నారంటూ మొసలి కన్నీరు కార్చారని చెప్పారు. అలా కవర్ చేసుకోవాలని చూసినా ఎవరూ నమ్మలేదన్నారు. సీఎం జగన్ కుప్పంకి వెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే దఫా అక్కడ భరత్ కచ్చితంగా గెలుస్తారని చెప్పారు. ఓటమి భయంతో చంద్రబాబు కుప్పం నుంచి పారిపోతారన్నారు కాకాణి. ఆయనకు నియోజకవర్గాలు వదిలిపెట్టి పారిపోవడం అలవాటేనని, కుప్పంలో చంద్రబాబు ఉండలేరని చెప్పారు. ఒకవేళ చంద్రబాబు కుప్పంలో పోటీ చేసినా గ్యారెంటీగా ఓడిపోతారని అన్నారు కాకాణి. 


Also Read : YS Sharmila : జగన్‌కు షాకిచ్చిన చెల్లి షర్మిల - "పేరు మార్పు" వివాదంపై తాజాగా చేసిన కామెంట్స్ ఏమిటంటే ?