AP Land Title Act Controversy :  ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్  (AP land titling Act 2023) వివాదంపై రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భూ వివాదాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని తెలిపారు.  సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సర్వే పూర్తి అయిన తర్వాత నోటిఫైడ్ చేస్తామన్నారు.  స్టేక్ హోల్డర్స్ ఇచ్చిన అభిప్రాయాలను తీసుకొని రూల్స్ తెస్తాం అన్నారు. ఇది వరకే పలు పిల్స్ హైకోర్టులో పడ్డాయి. హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ కూడా అమలు చేస్తామని ప్రకటించారు. 


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.  రెవిన్యూ అధికార వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, అవినీతి ఉందని ఇలాగే వుండిపోతే ఎలా ? అని ప్రశ్నించారు. దేశంలో, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టెక్నాలజీని ఉపయెగించుకొని సమగ్రంగా సర్వే చేస్తాం అని స్పష్టం చేశారు.  ఈ చట్టం పై ఆరోపణలు చేస్తున్నవారు.. చట్టాన్ని ఎందుకు తెస్తున్నామో తెలుసుకోవాలని సూచించారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం 14 శాతం హత్యలు, 60 శాతం నేరాలు కేవలం భూ వివాదాల వల్లే జరుగుతున్నాయని.. అందుకే  భూ వివాదాలు లేకుండా చేయడానికే ఈ చట్టం తెస్తున్నామని చెప్పారు. 


కోర్టుకు వెళ్లే అవకాశం లేదని ప్రచారం చేస్తున్నారని కానీ.. రాష్ట్ర స్థాయి రెవెన్యూ ట్రిబునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  ఏపీ భూ హక్కుల చట్టం    అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీంతో ఏపీ భూహక్కుల చట్టం అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ద్వారా భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి . కానీ ఈ చట్టంలో ఉన్న అంశాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని భూములను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పనిసరి చేసింది .  ప్రస్తుతం దాని అన్ని జిల్లాల్లో రీసర్వేలు చేపడుతోంది. స్థిరాస్తులకు శాశ్వత హక్కు కల్పించేందుకు ,  మరింత సమర్థవంతమైన వివాద పరిష్కారానికి కొత్త వ్యవస్థను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని సర్కార్ చెబుతోంది.  ఈ చట్టం అమలుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి), న్యాయవాదులు మరియు ఇతర కార్యకర్తల నుండి విస్తృత విమర్శలు వచ్చాయి. వాస్తవానికి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ చట్టం కీలక ఎన్నికల అంశంగా మారుతోంది. భూ వివాదాలు ఏర్పడితే కోర్టుకు పోయే అవకాశం లేదన్న క్లాజ్ ఉండంతోనే సమస్యలు వస్తున్నాయి.