Visakha Capital Issue: పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తరాలుగా వెనుకబాటుకు గురవుతూ వస్తున్న ఉత్తరాంధ్రకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఈ నిర్ణయానికి వచ్చారని అన్నారు. ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత, అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మన ప్రాంత ప్రజల కోరికను తీర్చుకోవడానికి గొంతెత్తి వీధుల్లోకి రావాలని.. అందరినీ చైతన్యవంతులను చేయాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దామంటూ మంత్రి ధర్మాన కామెంట్లు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘మన విశాఖ – మన రాజధాని సదస్సు’ కు మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అమరావతి పాదయాత్ర ముసుగులో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందని మంత్రి ధర్మాన ఆరోపించారు. రాజధాని కోసం కేంద్ర కమిటీ అందజేసిన నివేదికను చంద్రబాబు విస్మరించారన్నారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో చెప్పినా రెండేళ్లకే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఒకే రాజధాని పెట్టడం మంచిది కాదని కేంద్ర కమిటీ చెప్పిందని... ఒడిశాలోని కటక్‌లో హైకోర్టు, భువనేశ్వర్‌లో పాలన రాజధాని ఉంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే ఇనిస్టిట్యూషన్స్ వస్తాయని, ఇన్వెస్టిమెంట్స్ వస్తాయని చెప్పారు. తమ పిల్లలకు ఉన్నత చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఆస్తుల విలువలతో పాటు ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని సూచించారు. దీని గురించి మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు నోరు రావడం లేదంటూ మండిపడ్డారు.
అచ్చెన్నాయుడు దద్దమ్మ అనడం దారుణం..
తమ ప్రాంతం కోసం పోరాటం చేస్తున్న తమను.. అచ్చెన్నాయుడు దద్దమ్మలు అనడం దారణం అన్నారు. అచ్చెన్నాయుడుకు సరైన అవగాహన ఉందా అని ప్రశ్నించారు. అమరావతి వెనుక ఉన్న కుట్ర గురించి తెలుసా అంటూ మండిపడ్డారు. చేత గాకపోతే నోరు మూసుకొని కూర్చొండంటూ కామెంట్లు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల తరఫున తాము పోటీ చేస్తామని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడితే అవమానించినట్టేనని తెలిపారు. 2014లో రాష్ట్రం విడిపోతే చంద్రబాబు తన దగ్గర ఉన్న క్యాబినెట్ మంత్రిని నియమించి ఆయన నేతృత్వంలో ఓ నివేదిక రూపొందింపజేసి... అమరావతిని రాజధానిగా రూపకల్పన చేశారని ఆరోపించారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 5 కింద ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ పదేళ్ల పాటు ఉంటుందని.. అలా కాకుండా హైదరాబాద్ లో ఓ మూడు, నాలుగు నెలలు ఉండి వచ్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చి 33 వేల ఎకరాల భూమిని సేకరించారని... కానీ కమిటీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని తెలిపారు.
మూడు రాజధానుల ఆవశ్యకత తెలుసుకోండి..
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని పెట్టాలని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని, అదేవిధంగా విశాఖలో ఆంధ్రావర్శిటీని ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి ధర్మాన గుర్తుచేశారు. 80 ఏళ్ల కిందటే ఇదంతా జరిగిందన్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో.. కటక్ లో హైకోర్టు ఉంది, భువనేశ్వర్ లో క్యాపిటల్ ఉందని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో కూడా పరిపాలన వికేంద్రీకరణ ఉందని వివరించారు. అభివృద్ధిలో హెచ్చు తగ్గులు లేకుండా అన్ని ప్రాంతాలకూ సమానంగా పంచాలన్న రాజ్యాంగం చెప్తుంటే... ఆ సూత్రాన్ని టీడీపీ ప్రభుత్వం పాటించలేదని అన్నారు. తమకు నచ్చినట్లుగా అమరావతిని రాజధాని చేస్తున్నట్లు ప్రకటించి ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల ఏర్పాటు విషయమై కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చి.. పరిపాలన వికేంద్రీకరణకు ఉన్న ఆవశ్యకతను వివరించిందన్నారు. ఆ విధంగా విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని భావించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మంత్రి ధర్మాన తెలిపారు.
కావాలనే రామోజీరావు బురద చల్లుతున్నారు..
33 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంగీకరించడం లేదన్న అక్కస్సుతోనే టీడీపీ నేతలు, రామోజీ రావు తమపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. తాను అన్యాయం, అక్రమం చేసినట్లు తెలిస్తే తాను రాజీనామా చేసేందుకు అయినా సిద్ధం అని వివరించారు. విశాఖ ప్రాంత ప్రజల వెనుకబాటు తనం దూరం చేయడం తన బాధ్యత అని మంత్రి ధర్మాన చెప్పుకొచ్చారు. అందుకే రాజధాని కోసం పట్టుబడుతున్నానన్నారు. జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న తనను చాలా మంది దద్దమ్మ అంటున్నారని.. తెలిసీ తెలియకుండా ఇలా వాగొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు తెలియకపోతే ఊరుకోండని, ఈ ప్రాంత ప్రజలను అవమానం చేయకండని ఫైర్ అయ్యారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తామంతా రాజధాని కోసం కష్టపడుతున్నామని వివరించారు.