Minister Chelluboyina : టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగానే కాదు విపక్ష నాయకుడిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరొందల హామీలిచ్చి మోసగించారన్నారు. రైతులకు, మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని నిలువునా ముంచేశాడన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను మోసగించిన తెలుగుదేశం పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ. బీసీలకు 34శాతం రిజర్వేషన్ చంద్రబాబు ఇచ్చారని లోకేశ్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 32.33శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని గుర్తు చేశారు. టీడీపీ-వైఎస్ఆర్సీపీ పాలనలో బీసీలపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 


వడ్డీ లేకుండా రూ.10 వేలు


బీసీలంటే వెనకబడి కులాలు కాదు వెన్నెముక కులాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతమని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. బీసీలకు ఐటీ ఉద్యోగాలు రాకపోవడానికి చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్లల్లో చంద్రబాబు ఇస్త్రీపెట్టే, కుర్చీ ఇస్తే..జగనన్న చేదోడు పథకం కింద ఒక్కొక్కరికి వడ్డీ లేకుండా పదివేల రూపాయలు ఇస్తున్నామని ఉద్ఘాటించారు. బలహీన వర్గాలు ఎవరి దగ్గర యాచించకండా ఆత్మగౌరవంగా బతకాలని జగన్ ఆలోచించారని గుర్తు చేశారు. 33లక్షల మంది బీసీలకు  సొంతింటి కల నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీది అన్నారు. పేదవాడికి, పెత్తందారికి మధ్య జరిగే యుద్ధంలో పేదవారి కోసం నిలబడ్డవాడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.


జగనన్న చేదోడు పథకం 


పల్నాడు జిల్లా పెనుకొండలో జరిగిన బహిరంగ సభలో జగనన్న చేదోడు పథకం కింద మూడో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 30వేల 145మందికి 330.15కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు.  ఈ పథకం కింద అర్హులైన టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల రూపాయల సాయాన్ని రిలీజ్ చేశారు. ఈపథకం కింద షాపులున్న 1 లక్షా 67 వేల 951 మంది టైలర్లకు రూ.167.95 కోట్లు, 1లక్షా 14వేల 661 మంది రజకులకు రూ.114.67కోట్లు, 45వేల 533 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.47.53కోట్ల ఆర్థికసాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి జగన్. ఎలాంటి వివక్ష లేకుండా లంచాలకు తావులేకుండా పారదర్శకంగా ఆర్థికసాయం చేస్తున్నామని ప్రకటించారు. ఈ మూడేళ్లల్లో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51కోట్ల సాయం అందజేశామి సీఎం జగన్ ప్రకటించారు.  2020-21లో 2, 98,122 మందికి రూ.298.12కోట్లు, 2021.22లో 2,99,116 మందికి రూ.299.12కోట్లు, 2022-23లో 3,30,145 మందికి రూ.330.15 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఇలా ఈ మూడేళ్లల్లో మొత్తం రూ.927.39కోట్ల లబ్ధి అందించారు. 


పొత్తుల్లేకుండానే ఎన్నికలకు 


వైఎస్ఆర్సీపీ పాలనలో సంక్షేమాన్ని చూసి కొందరు తట్టుకోలేక శ్రీలంకగా మారుతుందని అసత్య ప్రచారం చేస్తున్నాయని జగన్  మండిపడ్డారు. వైసీపీ పాలనలో బటన్ నొక్కగానే నేరుగా డబ్బులు అకౌంట్లలో పడుతున్నాయని,  కానీ ఓసారి గత ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. గత పాలనలో గజదొంగల ముఠా,  దుష్టచతుష్టయం ఉండేదన్నారు. వాళ్ల స్కీమ్ డీపీటీ అంటే దోచుకో.. పంచుకో... తినుకో అని జగన్ విరుచుకుపడ్డారు. దొంగలముఠా పాలన కావాలా వైసీపీ పాలన కావాలా ఆలోచించాలని జగన్ కోరారు. పొత్తుల్లేకుండా సింహంలా నడుస్తానని జగన్ మాటిచ్చారు.