Where Is Botsa Sajjala : వైఎస్ఆర్‌సీపీ  ప్రభుత్వం నిర్వహించిన మొట్టమొదటి పెట్టుబడుల సదస్సు. అది కూడా భారీ ఎత్తున నిర్వహించిన   గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు.   విశాఖలోనే జరుగుతున్న ఈ సదస్సులో ఉత్తరాంధ్ర ముఖ్యనేత బొత్స సత్యనారాయణ కనబడలేదు ఎందుకు..? ప్రభుత్వంలో నెంబర్ -2 సజ్జల కూడా లేరు. ఈ అంశంపై ఇప్పుడు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 


ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అందరూ కనిపించారు.. ఇద్దరు తప్ప ! 


విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ శనివారం ముగిసింది. రెండు రోజుల పాటు.. విశాఖలో అట్టహాసంగా జరిపిన ఈ సదస్సు విజయవంతం అయిందని ప్రభుత్వం తెలిపింది. . ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు పోట్టెత్తినట్లు ప్రకటించుకుంది. ఈ సదస్సు కోసం ఎన్నో రోజులుగా వైఎస్సార్పీపీ ప్రభుత్వం సన్నాహకాలు చేసింది. దీనిని విజయవంతం చేసే పనిలో తీరికలేనంత బిజీగా ఉన్నందునే దావోస్ కూడా వెళ్లడం లేదని పరిశ్రమల మంత్రి అమరనాథ్ ప్రకటించారు. అంతా బానే ఉంది.. సదస్సు విజయవంతం అయింది.రూ.  13 లక్షల కోట్లు వచ్చాయి. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారగణం అంతా వచ్చారు కానీ ముఖ్యమైన వ్యక్తులు మాత్రం మిస్ అయ్యారు. 


అమరావతిలోనే ఉన్న  బొత్స, సజ్జల !


ప్రభుత్వంలో నెంబర్ -2 గా ఉన్నటువంటి ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సదస్సు ప్రాంగణంలో ఎక్కడా కనిపించలేదు. ఆయన సలహాదారు కాబట్టి ముఖ్యమంత్రి అప్పగించిన ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నారు అనుకోవచ్చు. కానీ ఉత్తరాంధ్రకే చెందినటువంటి సీనియర్ రాజకీయ నేత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి బొత్ససత్యనారాయణ తమ ప్రాంతంలో అంతపెద్ద సదస్సు జరుగుతుంటే హాజరుకాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సదస్సు తొలిరోజు.. ఉత్తరాంధ్రకే చెందిన స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  ఇలా చాలా మంది నేతలు హాజరయ్యారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం కనిపించలేదు.


ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్న బొత్స ! 


సదస్సు ప్రాంగణంలో బొత్స లేకపోవడం గురించి కొంతమంది పార్టీ నేతలు.. చర్చించుకున్నారు. అయితే ప్రభుత్వంపై ఉద్యోగసంఘాలు ఈ మధ్య మళ్లీ స్వరం పెంచాయి.  తమకు సమయానికి జీతాలు రావడం లేదని.. తమ ఫించను సొమ్మును దారి మళ్లించారని... వాళ్లంతా గరంగరం అవుతున్నారు. ఇంతకు ముందు పీఆర్సీ విషయంలో ఆందోళనలు చేసినప్పుడు వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ ముఖ్యమైన సభ్యులు. ఇప్పుడు కూడా ఉద్యోగుల విషయాన్ని పరిష్కరించడం కోసమే వాళ్లు అమరావతిలో ఉండిపోయారని  ఓ నేత చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి చూపిస్తుండటం.. ఏకంగా గవర్నర్ ను కలవడం.. కలిస్తే తప్పేంటి అని ప్రకటించడం వంటి వ్యవహారాలన్నీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. పైగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఉద్యోగల సంఘాల నేతలు కూడా ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుండటంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. పైగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని సమస్య పరిష్కారం కాకుంటే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వాళ్లు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. పెట్టుబడుల సదస్సు జరిగే ఇలాంటి తరుణంలో ఉద్యోగుల నుంచి ఏదైనా ఊహించనిది జరిగితే.. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే సీనియర్లు అయిన సజ్జల, బొత్సకు ఉద్యోగుల బాధ్యత అప్పగించినట్లుగా అర్థమవుతోంది. రెండు రోజులుగా వాళ్లు ఈ పనిమీదనే ఉన్నారని అంటున్నారు. 


అసలు కారణం అది కాదంటున్న సీనియర్ బ్యూరోక్రాట్స్ ! 


అయితే వీళ్లిద్దరూ నిజంగానే ఉద్యోగ సంఘాల సమస్య పరిష్కరించేందుకే ఉన్నారా మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రభుత్వంలోని ఓ ముఖ్యమైన అధికారిని అడిగినప్పుడు ముఖ్యమంత్రి వాళ్లకి ఓ “ముఖ్యమైన” పని అప్పగించారని.. అది ఉద్యోగుల సంఘాల విషయం కాదని చెప్పారు.  అంత “ముఖ్యమైన” పని ఏంటో మరి..!?