YSRCP Guntur :  గుంటూరు జిల్లా వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి.  జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు.  తన నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలిపానన్నారు.  అయితే పార్టీకి మాత్రం రాజీనామా చేయడం లేదని తాను తన నియోజకవర్గం ప్రత్తిపాడుకు మాత్రమే పరిమితమవుతానని ప్రకటించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మేకతోటి సుచరిత పదవి పోయింది. మాజీ మంత్రులందరికీ జిల్లా అధ్యక్ష బాధ్యతలిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా మేకతోటి సుచరితగా గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే  పార్టీలో ఆమెకు ప్రాధాన్యం తగ్గిపోవడం అవమానాలు జరుగుతూండటంతో జిల్లా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సుచరిత రాజీనామా


వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ వెంట మొదటి నుంచి నడిచారు మేకతోటి సుచరిత. ఆమె భర్త ఇన్‌కంట్యాక్ ఆఫీసర్. సుచరిత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తాడికొండ ప్రాంతానికి చెందిన వారైనా.. ప్రత్తిపాడు నుంచి రాజకీయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన  వెంటనే జగన్ మంత్రి పదవి ఇచ్చారు. కీలకమైన హోంమంత్రి పదవిఇచ్చారు .  అయితే రెండున్నరేళ్ల తర్వాత తర్వాత అందర్నీ తొలగిస్తానన్న మాట ప్రకారం జగన్ అందరితో రాజీనామాలు తీసుకున్నారు. అయితే కొంత మంది పాత వారిని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నా...  మంత్రి వర్గ విస్తరణలో ఆమె స్థానం గల్లంతయింది. అంతకు ముందు హోంమంత్రిగా కీలక పొజిషన్‌లో ఉండేవారు. తనతో పాటు మంత్రులుగా ఉన్న వారిని కొనసాగించి కీలక పదవులు ఇచ్చినా తనను మాత్రం పక్కన పెట్టారని ఆమె అసంతృప్తికి గురయ్యారు. 


గతంలో మంత్రి పదవి తొలగించినప్పుడు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసినట్లుగా ప్రచారం


ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరిగింది.ఆ తర్వాత జగన్ పిలిచి మాట్లాడటంతో చల్లబడ్డారు. తర్వాత జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు.  ఆమెను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా నియమించినా .. ఆమెకు తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. ఆమెను పట్టించుకునేవారు లేకుండా పోయారన్న అసంతృప్తికి గురయ్యారు. పార్టీ హైకమాండ్ తనను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో ...   సుచరిత అసంతృప్తిని జగన్ తీవ్రంగా పరిగణించారని.. పార్టీ ఎన్నో అవకాశాలిచ్చినా.. తిరుగుబాటుకు ప్రయత్నించారన్న ఆగ్రహంలో జగన్ ఉన్నారంటున్నారు. 


వైఎస్ఆర్సీపీలో   సుచరితపై కుట్ర జరుగుతోందా ?
 
ఈ సారి ప్రత్తిపాడు నుంచి కూడా ఆమెకు టిక్కెట్ ఇవ్వడం లేదని వైసీపీలో అంతర్గత ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆమె వేరే పార్టీల వైపు చూస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.   ఇదంతా  వైసీపీలో తనపై జరుగుతున్న కుట్రగా ఆమె భావిస్తున్నారు. కారణం ఏదైనా సుచరిత మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం.. వైసీపీలో కలకలం రేపుతోంది. 


శనివారం ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్ - కూల్చివేతలపై జనసేనాని ఆగ్రహం !