పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి, ఆందోళనకు, భయానికి గురి చేసింది. ఎందుకంటే సంపన్నుడైన ఆయన ఆ పని చేస్తుండడంతో స్థానికులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏంటని ఆరా తీసినా ఆయన చెప్పిన జవాబుతో ఎవ్వరూ సంతృప్తి చెందలేదు. పైగా అతని తీరుపై వారికి అనుమానం కలిగింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అసలేం జరిగిందంటే..
పశ్చిమ గోదావరి జిల్లా వెంకట కృష్ణాపురంలో ఓ వ్యక్తి ఒంటి నిండా బంగారు నగలు ధరించి, పైగా కారులో వచ్చి బిచ్చమెత్తాడు. ఈయన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులంతా ఆందోళన చెందారు. స్థానిక మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అజ్ఞాత వ్యక్తి పశ్చిమగోదావరి జిల్లా వెంకటకృష్ణాపురంలో మంగళవారం చిలుకూరి రాధాకృష్ణ అనే వ్యక్తి ఇంటికి మరో వ్యక్తి వెళ్లి బిచ్చం వెయ్యాలని అడిగాడు. రాధాకృష్ణ భార్య సునీత క్ష గిన్నెలో బియ్యం తీసుకెళ్లగా.. అవన్నీ తీసుకోకుండా కేవలం ఒక స్పూనుతో బియ్యం తీసుకున్నాడు.
సునీతకు ఇతని తీరు అనుమానం కలిగించింది. వెంటనే ఆమె తన భర్తకు ఫోన్ చేసి అతని గురించి వివరాలు చెప్పింది. ఇతరులకు ఫోన్ చేయడం గమనించిన ఆ వ్యక్తి తన కారు ఎక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో సునీత భర్త రాధాకృష్ణ ఇంటికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని నిలదీయగా తాను అన్నవరం సిద్ధాంతినని చెప్పుకున్నాడు. తాను ఇలా 11 ఇళ్లలో బియ్యం సేకరించి షిర్డీ వెళ్లి అక్కడి గోవులకు వండి దాణాగా అందిస్తానని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత కారులో అక్కడి నుంచి జారుకున్నాడు.
అనంతరం తిమ్మాపురంలో గత వారం ఇదే తరహాలో జి. గాంధీ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి నకిలీ జోస్యం చెప్పాలని చూశాడు. అతని కుమారుడికి ప్రాణ గండం ఉందని శాంతి జరిపించాలని మభ్య పెట్టి రూ.16,500 దండుకున్నాడు. ఆ తరువాత మళ్లీ కనిపించలేదు. వెంకటకృష్ణాపురంలో ఈ వ్యక్తి ఉన్నాడని తెలుసుకుని గాంధీ ఫోన్ చేస్తే తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసేశాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు విచారణ జరుపుతున్నారు.
Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి