AP Volunteer System: మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి (MLA Thippeswamy) నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని ఓ మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. పింఛన్ అప్లై చేయనందుకు తన కుటుంబంపై ఎంపీటీసీ, ఎమ్మెల్యే అనుచరులు కక్ష పూరిత చర్యలకు దిగారని, కుటుంబ సభ్యులపై దాడి చేశారని వాపోయింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని ప్రాధేయపడింది. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వీడియో విడుదల చేసింది.
వివరాలు.. మడకశిర నియోజకవర్గం అగలి మండలం కదిరేపల్లిలో వేద వలంటీర్‌గా పని చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఎంపీటీసీగా బసవరాజు పని చేస్తున్నారు. ఇటీవల ఆయన మామ చనిపోయారు. ఈ నేపథ్యంలో అతని అత్తకు పింఛన్ దరఖాస్తు చేయాలని వాలంటీర్ వేదకు సూచించారు. అయితే వ్యక్తి చనిపోయిన వెంటనే పింఛన్ ఎక్కించలేమని, అందుకు కొన్ని రూల్స్ ఉన్నాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు తీసుకోదని వారికి వాలంటీర్ వేద వివరించింది.
దీంతో ఆగ్రహించిన ఎంపీటీసీ బసవరాజు తన కుటుంబ సభ్యులకే పింఛన్ పెట్టడం లేదని వేదపై కక్ష పెంచుకున్నారు. వేద కుటుంబ సభ్యులపై స్థానిక వైసీపీ చోటా నాయకులతో దౌర్జన్యానికి దిగారు. అంతేకాదు, వేద కుటుంబ సభ్యులపై ఎంపీటీసీ వర్గీయులు, బంధువులు దాడికి దిగారు. వేద, ఆమె తల్లిదండ్రులు, తమ్ముడిని విచక్షణారహితంగా కొట్టారు. ఆపై తిరిగి వారి మీదే కేసు పెట్టారు. పోలీసులు సైతం అధికార వర్గానికి వత్తాసు పలికారు.
ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం తమను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నారని వేద ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ, ఎమ్మెల్యే ఒత్తిడితోనే తమను వేధిస్తున్నారని, వీరందరి నుంచి తమకు ప్రాణహాని ఉందని వాపోయారు. తన దుస్తులు చించివేశారని, అందరూ ఉండగా తమను దూషించి అవమానించారని ఆరోపించారు. తన తమ్ముడిని రక్తం వచ్చేలా కొట్టారని, తలకు తీవ్రగాయాలు అయ్యాయని, కుట్లు పడినట్లు ఆవేదన వ్యక్తం చూశారు. ఎంపీటీసీ వర్గీయులకు ఏమీ అవకపోయినా ఆస్పత్రిలో తప్పుడు పత్రాలు తెచ్చి కేసులు పెడుతున్నారని వేద ఆరోపించారు.
Also Read: CM Jagan Review: 9 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ - కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే తమను కేసులో ఇరికించి వేధిస్తున్నారని వేద ఆరోపించారు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులను వదిలేసి తమను కక్షపూరితంగా అన్యాయంగా పోలీసులు రిమాండ్ తరలిస్తున్నారని మహిళా వాలంటీర్ వేద ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి ఒత్తిడితోనే తమపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమకు న్యాయం చేయాలని వీడియో ప్రాధేయపడ్డారు. మరోచోట గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఓ మహిళా వాలంటీర్ తో ఫోన్ లో మాట్లాడుతూ బెదిరించినట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: భార్యను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన ఇండియన్, జీవిత ఖైదు విధించిన ఫ్లోరిడా కోర్టు