Pinnelli Ramakrishna Reddy Released From Jail: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయనకు శుక్రవారం ఏపీ హైకోర్టు (AP HighCourt) బెయిల్ మంజూరు చేయగా.. శనివారం బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో ఆయన్ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయనకు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పిన్నెల్లిని మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్‌తో పాటు ఇతర స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ను పరామర్శించారు. అనంతరం పిన్నెల్లి కారులో బయలుదేరి మాచర్లకు వెళ్లిపోయారు. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున పాల్వాయిగేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు.
షరతులతో కూడిన బెయిల్
ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం శనివారం పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని.. పాస్ పోర్ట్ అప్పగించాలని తెలిపింది. అలాగే, ప్రతీ వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం చేయాలని ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జైలు నుంచి పిన్నెల్లి విడుదలవుతున్న సందర్భంగా అక్కడకు పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani Govardhan Reddy) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని.. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఇలాగే చేస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు ఓడిపోతే హైదరాబాద్ వెళ్లిపోతారని అధికారులు ఇక్కడే ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. 'హైకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి జైలు నుంచి విడుదలయ్యారు. పిన్నెల్లి వరుసగా నాలుగుసార్లు మాచర్ల నుంచి విజయం సాధించారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గం. ఆయన ఏం నేరం చేశారని దాదాపు 2 నెలలు జైల్లో పెట్టారు.?. కేసులకు మేం భయపడం. చాలాచోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినా పిన్నెల్లిపై మాత్రమే కేసు పెట్టారు. ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో అవన్నీ మళ్ళీ పునరావృతమవుతాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం.' అని కాకాణి పేర్కొన్నారు.
Also Read: Kuppam Woman: మలేషియాలో కుంగిన ఫుట్ పాత్ - మ్యాన్ హోల్‌లో పడి కుప్పం మహిళ గల్లంతు, షాకింగ్ వీడియో