Andhra Pradesh Latest Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. అల్పపీడనానికి అనుబంధంగా ఈ ఆవర్తనం ఏర్పడినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే, రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఈ జిల్లాల్లో భారీ వర్షాలు


అల్పపీడన ప్రభావంతో విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు.


తెలంగాణలోనూ..


అటు, తెలంగాణలోనూ రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకూ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Also Read: Kendriya Vidyalaya: బాపట్ల కేంద్రీయ విద్యాలయ సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదం - 24 మంది విద్యార్థులకు అస్వస్థత, ఘటనపై ఆరా తీసిన సీఎం