Nellore Lokesh :  నెల్లూరు జిల్లా కావలిలో  వైఎస్ఆర్‌సీపీ నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ నేత లోకేష్ అండగా నిలిచారు.  ఆస్తులు తనకా పెట్టుకొని వడ్డీకి డబ్బులిచ్చిన వారి వద్ద నుండి దస్తావేజులను విడిపించి స్వయంగా ఇంటి కాగితాలను కరుణాకర్ భార్యకు అప్పగించారు. కావలి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. కరుణాకర్ ఇద్దరి పిల్లల చదువుకి సహాయం చేస్తానని  లోకేష్ హామీ ఇచ్చారు. 



 


చేపల చెరువును లీజుకు తీసుకున్నా .. అమ్ముకోనీయకుండా వైఎస్ఆర్‌సీపీ నేతల వేధింపులు


కరుణాకర్‌ కావలి రూరల్‌ మండలం అన్నగారిపాలెం ఫిషర్‌మెన్‌ సొసైటీ ద్వారా ముసునూరులోని రెండు చెరువులను నాలుగేళ్ల క్రితం సబ్‌ లీజుకు తీసుకున్నాడు. మూడేళ్లుగా ముసునూరుకు చెందిన వైఎస్ఆర్‌సీపీ  నేతలు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సురేష్‌రెడ్డి అనుచరులు.. కరుణాకర్‌ను చేపలు పట్టుకోనివ్వకుండా వేధిస్తున్నారు. గతేడాది కూడా చేపలు పట్టుకోవాలనుకున్నా.. చెరువులో నీరు వదలనీయకుండా  అడ్డుకున్నారు. రూ.6 లక్షలతో చేపల చెరువులకు సబ్‌ లీజ్‌కు చెల్లించటమే కాక చెరువుల్లో చేప పిల్లలు వేసి, వాటిని పెంచడానికి కరుణాకర్‌ రూ.20 లక్షల వరకు అప్పులు చేసి ఖర్చు చేశాడు. 


వివరంగా లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న కరుణాకర్ 
 
శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్‌ నోట్‌ రాశాడు. 


సూసైడ్ నోట్‌లో కోరినట్లుగా అప్పు తీర్చి ఇంటి పత్రాలు కుటుంబసభ్యులకు ఇచ్చిన లోకేష్ 


సూసైడ్‌ నోట్‌లో నాకు ఉన్న ఆస్తి ఇల్లు మాత్రమే. అదీ తాకట్టులో ఉంది. అది విడిపించి ఆడబిడ్డలకు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు లోకేష్ ఆ అప్పులను తీర్చి.. ఇంటి డాక్యుమెంట్‌లను కరుణాకర్ భార్య, పిల్లలకు అందించారు. కరుణాకర్‌ ఆత్మహత్యపై జగదీశ్వర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డిలపై కావలి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐపీసీ 306 సెక్షన్ల కేసు నమోదైంది.  దుగ్గిరాల కరుణాకర్‌ మృతిపై ఆర్డీవో శీనానాయక్‌ అధ్యక్షతన విచారణ జరిగింది. తన భర్త మృతికి కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి, సురేష్‌ రెడ్డి కారణమని కరుణాకర్ భార్య వాంగ్మూలం ఇచ్చారు.