Lokesh deleted tweet on mid day meal canteen: రాజకీయాల్లో చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్స్ కూడా పెద్ద సమస్యలు సృష్టిస్తాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి. నారా లోకేష్ ఈ విషయంలో చురుకుగా స్పందించారు. ఓ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు.
కడపలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కోసం ఓ స్మార్ట్ కిచెన్ ను నిర్మించారు. ఈ కిచెన్ గొప్పతనం గురించి చెబుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రతి రోజు పన్నెండు గవర్నమెంట్ స్కూల్స్‌కి, 2200 మంది విద్యార్థులకు ఈ క్యాంటీన్ నుంచి భోజనం వెళ్తోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యాప్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఇలాంటివే మరో నాలుగు స్మార్ట్ కిచెన్స్ సిద్ధమవుతున్నాయని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
కాసేపటికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ట్వీట్ పోస్టు అయింది. పవన్ కల్యాణ్ గత ఏడాది ఆ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం నా వ్యక్తిగత నిధుల నుంచి అందించానని పవన్ తెలిపారు. ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ సిద్ధమైంది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
చంద్రబాబు, లోకేష్ తీసుకొస్తున్న మార్పులు కచ్చితంగా చక్కటి ఫలితాలనిస్తున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న ప్రమాణాలను తెలియచేస్తున్నాయని పోస్టు పెట్టారు.
పవన్ కల్యాణ్ పోస్టులో కౌంటర్ ఇచ్చినట్లుగా లేదు కానీ.. లోకేష్ పెట్టిన పోస్టులో ఆ స్మార్ట్ కిచెన్ కు నిధులు ఇచ్చిన పవన్ కల్యాణ్ పేరు లేదు. ఆ విషయాన్ని పవన్ స్పష్టంగా చెప్పినట్లుగా ఉండటంతో.. లోకేష్ తన ట్వీట్ ను డిలీట్ చేశారు.
పూర్తిస్థాయిలో నిధులు ఇచ్చిన పవన్ కల్యాణ్ పేరు ట్వీట్ లో లేకపోవడంతో నారా లోకేష్ వెంటనే అప్రమత్తమయ్యారు. సాధారణంగా మంత్రులు, ప్రజా ప్రతినిధుల సోషల్ మీడియా అకౌంట్లను ఏజెన్సీలు నిర్వహిస్తూ ఉంటాయి. అయితే వారు ఎలాంటి ట్వీట్లు పెట్టమని చెబుతారో అవే పెడతారు. నారాలోకేష్ ఈ స్మార్ట్ కిచెన్ అంశంపై ట్వీట్ పెట్టమని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసే వారికి చెప్పి ఉంటారు కానీ.. ఆ కంటెంట్ ను సరిగ్గా పరిశీలించకపోవడంతో పోస్టు అయి ఉంటుందని.. విషయం తెలియగానే డిలీట్ చేయించారని భావిస్తున్నారు.