Cheetah Migration In Nellore District: ఏపీలోని పలు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిరుత సంచారంతో ఆందోళన నెలకొంది. నెల్లూరు జిల్లా (Nellore District) రాపూరు మండలం పెంచలకోన (Penchelakona) అటవీ ప్రాంతంలో కొందరికి చిరుతపులి కనిపించింది. పెంచలకోన దేవస్థానం అటవీ శాఖ పార్కు సమీపంలో అతిథి గృహం వద్ద బుధవారం రాత్రి చిరుత కనిపించింది. గెస్ట్ హౌస్ సమీపంలో బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను గమనించిన వాహనదారులు వీడియోలు తీశారు. కారు హారన్ ఒక్కసారిగా కొట్టడంతో అటవీ ప్రాంతంలోకి పరారైంది. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాగా, చిరుతను చూసిన వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.


అటు, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపులి ఆనవాళ్లు గుర్తించామని.. ఒడిశా నుంచి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీసి అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు. దీంతో గ్రామాల్లో చాటింపు వేయించి, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. రాత్రి పూట గ్రామాల్లో ఒంటరిగా సంచరించొద్దని హెచ్చరించారు.


మరిన్ని ప్రాంతాల్లో..


మరోవైపు, ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం అక్కడి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల క్రితం మేత కోసం వెళ్లిన ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని యజమాని తెలిపారు. స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటు, అనంత జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని  గూబనపల్లిలోనూ చిరుత దాడిలో ఆవుదూడ మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 


Also Read: Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు