Hemant Soren Sworn In As Jharkhand CM: ఝార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (Hemant Soren) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ (Santosh kumar Gangwar) ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కర్ణాటక డిప్యూటీ డీకే శివకుమార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా ఇతర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హేమంత్ సోరెన్‌కు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన.. 5 నెలల అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టిన సోరెన్.. తన సతీమణితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తీవ్రంగా శ్రమించి ప్రజల్లో నమ్మకాన్ని కూడగట్టారు. సమిష్టి కృషితో పార్టీని విజయ తీరాలకు చేర్చారు.
కాగా, ఇటీవల ఎన్నికల్లో 81 స్థానాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే. జేఎంఎం 34 చోట్ల విజయం సాధించగా.. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 2, ఏజేఎస్‌యూపీ, లోక్ జనశక్తిపార్టీ (రాంవిలాస్), జేఎల్‌కేఎం, జేడీయూ చెరో స్థానం చొప్పున గెలుచుకున్నాయి.
బీజేపీపై విమర్శలు
ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు సోరెన్ బీజేపీపై (BJP) విమర్శలు సంధించారు. ఝార్ఖండ్ ప్రజలను ఎవరూ విడగొట్టలేరని అన్నారు. 'ఐకమత్యమే మనందరి ఆయుధం. అందులో ఎలాంటి సందేహం లేదు. మనల్ని ఎవరూ విభజించలేరు. తప్పుదోవ పట్టించలేరు. మన గొంతు నొక్కాలని వారెంతో ప్రయత్నించినా.. వారి ప్రయత్నానికి రెట్టింపుగా మన తిరుగుబాటు స్వరం మరింత బలపడింది. ఎందుకంటే మనమంతా ఝార్ఖండ్ గడ్డ బిడ్డలం. ఎవరికీ తలవంచం.' అని సోరెన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.