Weather Updeates In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో తీవ్ర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల (Mancherial) జిల్లా భీమారంలో (Bhimaram) 47.2 డిగ్రీలు, కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో 46.6, ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ దరిలో 45.2, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు, ఏపీలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ఏపీలో ఈ ప్రాంతాల్లో వడగాలులు


ఏపీలో గురువారం ప్రకాశం జిల్లా పామూరులో 44.8 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7, తిరుపతి జిల్లా రేణిగుంటలో 44.6, కృష్ణా జిల్లా కోడూరులో 44.5, నెల్లూరు జిల్లా మనుబోలులో 44.4, అల్లూరి జిల్లా కూనవరంలో 44.3, గుంటూరు జిల్లా తుళ్లూరులో 44.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సైతం ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నెల 31న (శుక్రవారం) అల్లూరి జిల్లా కూనవరం మండలంలో తీవ్ర వడగాల్పులు, 145 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, శనివారం 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం విజయనగరం 3, పార్వతీపురం మన్యం 3, అల్లూరి 3,  ఏలూరు 2, కృష్ణా 4, ఎన్టీఆర్ 13, గుంటూరు 17, బాపట్ల 14, పల్నాడు 28, ప్రకాశం 27, నెల్లూరు 18, నంద్యాల 1, అనంతపురం 5, సత్యసాయి 2, వైయస్ఆర్ 4, అన్నమయ్య ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. 


కూల్ న్యూస్ సైతం


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న వేళ ఐఎండీ అధికారులు కూల్ న్యూస్ సైతం అందించారు. గురువారం కేరళ తీరాన్ని నైరుతి రుతు పవనాలు తాకినట్లు చెప్పారు. ఈ క్రమంలో కేరళతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో  రుతు పవనాలు రాయలసీమను తాకుతాయని తెలిపారు. అటు, తెలంగాణలో జూన్ 1 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 1న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భునవగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు, జూన్ 2, 3 తేదీల్లో కొన్ని జిలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.


కాగా, గతేడాది కంటే వారం ముందుగానే రుతుపవనాల పురోగమనంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈసారి ముందుగానే నైరుతి పవనాలు కేరళను తాకాయి. సాధారణంగా ఈశాన్య భారతంలో జూన్ 5కు కాస్త అటు, ఇటుగా రుతు పవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మే 30నే కేరళలోకి ప్రవేశించాయి. రేమాల్ తుఫాను ప్రభావంతో రుతు పవనాలు వేగంగా కేరళను తాకినట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.


Also Read: Diamonds Hunting: కర్నూలు, అనంతపురంలో వజ్రాలవేట, అదేపనిగా పొలాల్లో సీరియస్‌గా వెతుకులాటలు!