సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ వాసి.., లాన్స్‌నాయ‌క్ సాయితేజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.  


డీఎన్ఏ పరీక్షల అనంతరం సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించినా... ఢిల్లీ నుంచి బెంగళూరుకు తరలించే సరికి నిన్న సమయం మించిపోయింది. సైనికాధికారుల నివాళుల అనంతరం బేస్ క్యాంప్ మార్చురీలో పార్థివదేహాన్ని భద్రపరిచారు. ఇవాళ చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో కుటుంబసభ్యులకు సాయితేజ పార్థివదేహాన్ని సైనిక అధికారులు అందజేశారు. వీర జవాన్‌కు కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల వద్దే ఘనంగా నివాళులు అర్పించి భారీ ద్విచక్రవాహన ర్యాలీతో స్వగ్రామానికి తరలించారు. అంబులెన్స్ పై పూలు చల్లుతూ నివాళులర్పించారు.


భౌతికకాయం ఇంటికి చేరగానే.. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు సాయితేజ కొడుకును చూసి.. అక్కడకు వచ్చిన జనమంతా ఆవేదన వ్యక్తం చేశారు. సాయితేజ భార్యను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. జనవరిలో వస్తానన్న భర్త మృతుడై రావడంతో ఆమె తట్టుకోలేక పోయింది. నిర్జివంగా పడి ఉన్న కొడుకును చూసి.. సాయితేజ తండ్రి, తల్లి గుండెలు బాదుకుని రోదించారు.





అమర జవాన్‌కు తుది నివాళి అర్పించేందుకు.. ఎగువరేగడకు వేలాది మంది తరలివచ్చారు. సాయితేజ ఇంటికి దగ్గర్లోని ఓ గ్రౌండ్‌లో భౌతికకాయాన్ని ఉంచారు. 


అనంతరం అంతియాత్ర కొనసాగింది. సాయితేజ పార్థివదేహం ఉన్న పేటికను.. స్నేహితులు మోశారు. దారి పొడవునా వేలాది మంది.. కన్నీటి వీడ్కోలు పలికారు.  అంత్యక్రియాలు జరిగే ప్రదేశంలో.. సాయితేజ భార్య సొమ్మసిల్లి పడిపోయింది. భర్త లేడనే విషయంతో ఆమె పెట్టిన కన్నీరు చూసి.. అక్కడకు వచ్చిన వారంతా.. దు:ఖంలో మునిగిపోయారు. సాయితేజ భార్యను ఓదార్చడం ఎవరితరం కాలేదు.


సాయితేజ పార్థీవదేహంపై కప్పిన జాతీయ జెండా అతడి భార్య శ్యామలకు అందించారు ఆర్మీ అధికారులు.  కన్నీటి నివాళితో ఎగువరేగడలో సాయితేజ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. 


Also Read: In Pics: జవాన్ సాయితేజ అంతిమయాత్ర ఫోటోలు.. హాజరైన వేలాది మంది జనం


Also Read: Chandrababu Saiteja : సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !


Also Read: Gen Bipin Rawat Last Rites LIVE: వీడ్కోలు వీరుడా.. ముగిసిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు


Also Read: CDS Chopper Black Box: ఎట్టకేలకు హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. డీకోడింగ్‌ కోసం తరలింపు.. వీడియో